‘పట్టిసీమ’పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో | highcourt refuses to gives stay on pattiseema project g.o. | Sakshi
Sakshi News home page

‘పట్టిసీమ’పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో

Mar 12 2015 9:06 PM | Updated on Aug 31 2018 9:15 PM

‘పట్టిసీమ’పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో - Sakshi

‘పట్టిసీమ’పై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో

పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 80 టీఎంసీల నీటిని మళ్లించేందుకు వీలుగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న జారీ చేసిన జీవోకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

హైదరాబాద్: పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 80 టీఎంసీల నీటిని మళ్లించేందుకు వీలుగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న జారీ చేసిన జీవోకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల ముఖ్య కార్యదర్శులకు, చీఫ్ ఇంజనీర్, ఇంజనీర్ ఇన్ చీఫ్, కేంద్ర జల వనరుల కమిషన్ చైర్మన్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి మళ్లింపు కోసం జారీ చేసిన పరిపాలన అనుమతులను సవాలు చేస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు తమ తమ వాదనలను వినిపించారు. ముందుగా సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం బచావత్ అవార్డులకు విరుద్ధమని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రం చూస్తోందని, కాబట్టి భారీ నిధులు కేటాయించి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన కోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఉందన్నారు. తరువాత దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యాన్ని విచారణార్హతే లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కేవలం వరద నీటి మళ్లింపు కోసమే ఉద్దేశించిందని వివరించారు. ఈ పథకం నిర్మాణం వల్ల పిటిషనర్‌కు ఎటువంటి నష్టం కలగడం లేదన్నారు.

ఎత్తిపోతల పథక నిర్మాణం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందువల్ల ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం తగదన్నారు. ఈ వ్యాజ్యాన్ని ఏ రకంగానూ విచారణార్హత లేదని, అందువల్ల దీనిని ఆ కారణం చేతనే కొట్టివేయాలన్నారు. ఆ తరువాత జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, గోదావరి జలాల వ్యవహారం ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉందని, కాబట్టి నీటి వినియోగానికి సంబంధించి ఎవరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. అనంతరం సత్యనారాయణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో కనీసం ప్రాజెక్టు పనులు కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుందనే ఉత్తర్వులనైనా ఇవ్వాలని కోరారు. అందుకు సైతం న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిస్తూ విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement