మండలంలోని కిత్తన్నపేట గ్రామంలో గురువారం హైడ్రామా నెలకొంది. ఒకేరోజు ఇద్దరు మరణించడంతో అనుమానం
కిత్తన్నపేట(లక్కవరపుకోట): మండలంలోని కిత్తన్నపేట గ్రామంలో గురువారం హైడ్రామా నెలకొంది. ఒకేరోజు ఇద్దరు మరణించడంతో అనుమానం వచ్చిన పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణకు పట్టుపట్టారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. చివరకు ఇద్దరి మృతికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని గ్రామస్తులు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి..కిత్తన్నపేట గ్రామానికి చెందిన వంకాల లక్ష్మి(15) విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఎస్.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ నెల 21 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో లక్ష్మి మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో పాటు లక్కవరపుకోట పాఠశాల విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. అదే గ్రామానికి చెందిన దుక్క త్రినాథ్(21) ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, నిరుద్యోగం కారణంగా మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజూమునే పశువుల పాకలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజూమున తండ్రి అచ్చిబాబు చూడగా త్రినాథ్ విగతజీవిగా దర్శనమిచ్చాడు. దీంతో వెంటనే దహన కార్యక్రమాలు జరిపించారు.
ఒకే రోజు ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్‌ఐ ఎ.నరేష్ ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చి ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణ నిర్వహించారు. అప్పటికే త్రిమూర్తులు దహనసంస్కరణలు పూర్తవగా, లక్ష్మి దహణ సంస్కరణలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్మశాన వాటికకు లక్ష్మి మతదేహం తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కలుగజేసుకొని మరణాలు ఎటువంటి వివాదాస్పదం కావని వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.