అక్రమ మైనింగ్‌ వెనుక ఉన్నదెవరు?

High Court Orders CID Officers Prober Into illegal Limestone Mining in Guntur - Sakshi

 పల్నాడులో అక్రమంగా లైమ్‌స్టోన్‌ తవ్వకాలతో ఖజానాకు నష్టం  

 అసలు సూత్రధారిని తేల్చండి 

ఇప్పటిదాకా దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక ఇవ్వండి 

సీఐడీ అధికారులకు  హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడు గ్రామాలతోపాటు మరికొన్ని చోట్ల జరిగిన అక్రమ లైమ్‌స్టోన్‌ తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తేల్చాలని సీఐడీ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘భారీస్థాయిలో అక్రమ మైనింగ్‌ జరిగిన మాట వాస్తవం. ఖనిజాన్ని వాహనాల్లో తరలించిన మాట వాస్తవం. ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిన మాట వాస్తవం. కాబట్టి వీటన్నింటికీ కారణం ఎవరో తేల్చి, వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉంది’’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో, ఇప్పటిదాకా ఏం చేశారో తెలియచేస్తూ పురోగతి నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు మరికొన్ని గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా య«థేచ్ఛగా లైమ్‌స్టోన్‌ తవ్వకాలు సాగిస్తున్నారని, ప్రభుత్వానికి రూ.31 కోట్ల మేర పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. 

యరపతినేని పాత్ర ఉన్నట్లు తేలలేదు 

యరపతినేని శ్రీనివాసరావు తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదన్నారు. అక్రమ మైనింగ్‌లో ఎమ్మెల్యే యరపతినేని పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో ఇప్పటిదాకా తేలలేదని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితా నుంచి యరపతినేని పేరును తొలగించాలని కోరారు. 

612 మందిని విచారించాం.. 

అక్రమ మైనింగ్‌ కేసులో ఇప్పటిదాకా ఎంతమంది సాకు‡్ష్యలను విచారించారని ధర్మాసనం ప్రశ్నించగా.. 612 మంది సాకు‡్ష్యలను విచారించామని, ఇంకా మరింత మందిని విచారించాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) డి.రమేశ్‌ బదులిచ్చారు. విచారించిన వారిలో రెవిన్యూ అధికారులు, గనుల శాఖ అధికారులు, విద్యుత్‌ శాఖ అధికారులు, రవాణా శాఖాధికారులు ఉన్నారని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top