టేకోవర్‌ ఉద్దేశం ఉందా? లేదా?

high court fire on AgriGold case - Sakshi

అగ్రిగోల్డ్‌ టేకోవర్‌కు ఎస్సెల్‌ గ్రూపు నాన్చివేతపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ వ్యవహారంలో ఎస్సెల్‌ గ్రూపు నాన్చివేత ధోరణిపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే నెలరోజులకుపైగా గడువునిచ్చినప్పటికీ అగ్రిగోల్డ్‌ ఆస్తులు, అప్పుల మదింపు ప్రక్రియను కొలిక్కి తీసుకురాకపోవడంపై ఎస్సెల్‌ గ్రూపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మదింపు ప్రక్రియ ఇంకా చీకట్లోనే ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ నెల రోజుల్లో ఎన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు? ఇంకెన్ని పరిశీలించాలి? అన్న విషయంపై స్పష్టత నివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పని చేయకుండా పదే పదే గడువు కోరడం సమంజసం కాదంది. ఇకపై గడువునిచ్చే ప్రసక్తే లేదని, అసలు టేకోవర్‌ ఉద్దేశం ఉందో? లేదో? చెప్పాలని ఎస్సెల్‌ గ్రూపును నిలదీసింది. ఇప్పటి వరకు చేసిన పనికి సంబంధించిన వివరాలతో పూర్తిస్థాయి అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ఎస్సెల్‌ గ్రూపునకు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

‘అక్షయ గోల్డ్‌’పై ఆసక్తి చూపేవారెవరు?
అక్షయగోల్డ్‌ ఆస్తుల స్వాధీనం విషయంలో ఆసక్తిగా ఉన్న వారి వివరాలను తెలియచేయకుండా, ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటే ఎలా అంటూ ఆ సంస్థ డైరెక్టర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తుల స్వాధీనానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు, వ్యక్తుల చిరునామాలు, వారి ఆర్థిక స్థితికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఆ వివరాలను పరిశీలించిన తరువాతే ఆస్తుల స్వాధీనంపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. మరోసారి గడువువిచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top