ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్‌!  | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్‌! 

Published Mon, Oct 8 2018 9:57 PM

Heavy Rains In North Andhra Coastal Area Warns Weather Forecasts - Sakshi

సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్‌: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. ఈమేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది. సోమవారం రాత్రికి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 620, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 650 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో పయనిస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని తీవ్రత పెరిగి బుధవారం నాటికి తుపానుగా మారి, ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుందని ఐఎండీ వివరించింది.

వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్లు, తుపానుగా మారాక బుధ, గురు వారాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకోస్తా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ డి.వరప్రసాద్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తుపాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. 

Advertisement
Advertisement