గాలివాన బీభత్సం.. అమరావతి అస్తవ్యస్తం

Heavy Rain and Windy winds In Capital Amaravati Area - Sakshi

రాజధాని ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం 

భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు, సందర్శకులు

కూలిన ‘రూ.25 లక్షల’ స్మార్ట్‌పోల్‌

గాలికి సచివాలయంలోని బ్లాకులపై ఎగిరిపోయిన రేకులు 

పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు ధ్వంసం  

నిర్మాణ దశలో ఉన్నభవనాల వద్ద గందరగోళం 

నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు వద్దా అదే పరిస్థితి

కృష్ణా జిల్లాలో చెట్టు కూలి ఒకరు, గుంటూరు జిల్లాలో

పిడుగు పడి మరొకరు మృతి

సాక్షి నెట్‌వర్క్‌: భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్‌ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్‌ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం. గతంలో వర్షాలకు తాత్కాలిక సచివాలయంలోని వివిధ బ్లాకుల్లో నీరు కారడమే కాకుండా పెచ్చులూడి కింద పడిన సంగతి తెలిసిందే. 
గాలి వానకు హైకోర్టు ప్రాంగణంలోని పడిపోయిన సందర్శకుల షెడ్లు   

తాత్కాలిక హైకోర్టు వద్ద భయానక వాతావరణం 
రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. గాలి తీవ్రతకు ప్రధాన ద్వారం వద్ద పెద్ద గాజు తలుపు పగిలిపోయింది. హైకోర్టు ఎదురుగా వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిపై ఉన్న రేకులన్నీ ఎగిరిపోయాయి. హైకోర్టు పైన చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇనుప షీట్లు కూడా గాలికి కొట్టుకుపోయాయి. హైకోర్టు గోడలకు అమర్చిన రాజస్థాన్‌ టైల్స్‌ ముక్కలు ముక్కలయ్యాయి. హైకోర్టు సమీపంలోని అన్న క్యాంటీన్‌ అద్దాలు విరిగిపోయాయి. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో న్యాయవాదులెవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. 

మహిళకు తీవ్ర గాయాలు 
గాలి తీవ్రతకు తాత్కాలిక హైకోర్టు వద్ద ఇనుప రేకులు గాల్లోకి ఎగిరాయి. అక్కడ పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళపై ఇనుప రేకు పడడంతో తీవ్రంగా గాయపడింది. తలకు సైతం బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. బాధితురాలిని పోలీసులు ‘108’ వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమణమ్మ తలకు వైద్యులు 8 కుట్లు వేశారు.  

కృష్ణా జిల్లాలో తెగిపోయిన కరెంటు తీగలు 
గాలివాన ధాటికి కృష్ణా జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరులో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వణుకూరు–మద్దూరు గ్రామాల మధ్యలో రోడ్డుపై హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. పెనమలూరు పల్లిపేటలో చెట్లు విరిగిపడడంతో ట్రాన్స్‌ఫారం నేలకూలింది. గోసాల నెహ్రూనగర్‌ వద్ద భారీ వృక్షం బందరు రోడ్డుపై పడిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. పోరంకిలో తాటిచెట్లు విద్యుత్‌ లైన్లపై పడటంతో కరెంటు తీగలు తెగిపోయాయి. స్తంభాలు పడిపోయాయి. 

చెట్టు కూలిపోయి వ్యక్తి మృతి 
కృష్ణా జిల్లాలో పెదపులిపాక గ్రామానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌(56) అనే వ్యక్తి పశువులను మేపడానికి ఉంగరం కరకట్ట వద్దకు వెళ్లాడు. భీకర గాలులకు చెట్టు కూలి అతడిపై పడిపోయింది. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడి, మృతి చెందాడు. 

గుంటూరు జిల్లాలో పండ్ల తోటలు ధ్వంసం 
అకాల వర్షం కారణంగా గుంటూరు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ప్రజలు అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లో అరటి, మామిడి, సపోటా తోటలకు నష్టం వాటిల్లింది. మంగళగిరి నియోజకవర్గంలో వడగళ్ల వాన కురిసింది. పసుపు పంట వర్షం నీటికి తడిసిపోయింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పిడుగు పడి గొర్రెల కాపరి కావలి దానయ్య(20) మృతి చెందాడు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో పులిపాటి శ్రీనివాసరావుకు చెందిన గేదె పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. కొల్లిపర, తెనాలి మండలాల్లో వందలాది ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేమూరు నియోజకవర్గంలో పెరవలిపాలెంలో అరటి తోటలు నేలకూలాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం వేమవరంలో స్పిన్నింగ్‌ మిల్లుల్లో పనిచేసే కార్మికులు నివాసం ఉంటున్న షెడ్లపై చెట్టు విరిగిపడడంతో మహిళకు గాయాలయ్యాయి. ఈదురుగాలులకు పూరిల్లు, గుడిసెలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. 

‘పశ్చిమ’ ఏజెన్సీలో ఈదురు గాలులు 
పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలుల వీచాయి. భారీ వర్షం కురిసింది. పోలవరం మండలంలోని వాడపల్లి నుంచి కొత్తూరు వరకు ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. తల్లవరం, గాజులగొంది గ్రామాల్లో అరటి తోటలు పడిపోయాయి. కళ్లాల్లో మొక్కజొన్న పంట తడిచిపోయి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. గాజులగొంది గ్రామంలో విద్యుత్‌ స్తంభం విరిగి పడిపోవడంతో మూలెం రామయ్యకు చెందిన ఎద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈదురుగాలుల వల్ల పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top