అతను అంధుడు.. ఆమె చెవిటి.. ఒకరికొకరు

Handicapped couple Inspirational story - Sakshi

దివ్యమైన బతుకు

విధిని ఎదిరించిన దంపతులు

వ్యాపారం చేస్తూ ఎందరికో ఆదర్శం

బతుకు పోరాటంలో మరెందరికో స్ఫూర్తి

ఆయన అంధుడు. ఆమె బధిర (చెవిటి, మూగ). అతనికి కనిపించదు. ఆమెకు వినిపించదు..మాట్లాడలేదు. అయితేనేం వారు ఒకరికొకరు బాగా అర్థం చేసుకోగలరు. ఇద్దరూ చక్కగా సంసారం చేసుకుంటూనే వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. అన్నీ సవ్యంగా ఉండి ఏమీ చేయలేని ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.- సాక్షి, అనంతపూర్

ఆయన పేరు మహమ్మద్‌ వలి, ఆమె పేరు తాహీరాబేగం. వీరి స్వగ్రామం గుంతకల్లు. చిన్నతనంలోనే తీవ్రమైన జ్వరం, అమ్మవారు పోయడంతో మహమ్మద్‌ వలి కంటిచూపు కోల్పోయాడు. పదేళ్ల వయస్సులో తండ్రీ దూరమయ్యాడు. దీంతో తల్లి హలీమా ఇళ్లలో పనులు చేసుకుంటూ మహమ్మద్‌ వలి పెంచి పెద్ద చేసింది. నాలుగేళ్ల క్రితం ఆమె కూడా కన్నుమూసింది. దీంతో బతుకుదెరువు కోసం నేర్చుకున్న హర్మోనియమే మహమ్మద్‌ వలికి అన్నం పెట్టింది. నాటకాల ట్రూప్, ఖవ్వాలి ప్రోగ్రామ్‌లలో హార్మోనియం వాయిస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే బధిర (మూగ, చెవుడు) యువతి తాహీరాబేగంతో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఇష్టంగా మారడంతో దీంతో  వీరిద్దరికీ పెళ్లి చేసి ఒకటి చేశారు. తాహీరా తన కళ్లతో వలికి ప్రపంచాన్ని చూపుతుండగా...వలి తన భార్యకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు. వీరి ఆన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా ఒక బాబు కూడా పుట్టాడు. 

♦ ఉపాధిలేక... ఇల్లు గడవక
వలికి చూపు లేకపోయినా హార్మోనియంను కళ్లుగా చేసుకొని అందరినీ ఆకర్షించేవాడు. ఖవ్వాలి, పౌరాణిక నాటక ప్రదర్శనల ద్వారా నెలకు రూ.2 లేదా 3 వేలు దాకా ఆర్జిస్తుండేవాడు. పెళ్లి తర్వాత ఖర్చులు పెరిగాయి. హార్మోనియానికి పిలుపు కరువైంది. నెలకు వచ్చే రూ.2 వేలు, ప్రభుత్వ పింఛనుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆదాయం తక్కువ..ఖర్చులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణ భారమైంది. దిక్కు తోచని స్థితిలో మహమ్మద్‌ వలి ప్రతి శుక్రవారం మసీదుల వద్ద భిక్షాటన చేసేవాడు.

♦ ఆర్థిక చేయూత నిచ్చిన మీడియా సంస్థ
ఈ దంపతుల దీనగాథ తెలుసుకున్న ఓ మీడియా సంస్థ  మానవతా దృక్ఫథంతో  స్పందించింది. ఆర్థిక సహాయం అందజేసి వలి, తాహీరాబేగం దంపతులతో పట్టణంలోని 60 అడుగులరోడ్డులో సుధాకర్‌రెడ్డి కోళ్లపారం సమీపాన పేపర్‌ ప్లేట్లు, డిస్పోజబుల్‌ గ్లాసులు దుకాణాన్ని ఏర్పాటు చేయించింది.  

♦ వ్యాపారంలోనూ తోడూనీడగా..
తాహీరాబేగం, మహమ్మద్‌ వలిలు చేతి సవ్వడిల ద్వారా ఒకరికొకరు భావాలను పంచుకుంటూ ఈ వ్యాపారాన్ని చక్కగా సాగిస్తున్నారు. వినియోగదారుడు వస్తే ఆర్డర్‌ తీసుకునే వలి... చేతి సవ్వడిల ద్వారా భార్య తాహిరాబేగానికి తెలుపుతాడు. ఆమె సరుకు అందజేసి డబ్బులు తీసుకుంటుంది.  ఈ తరహా వ్యాపారం చేసేవారు పట్టణంలో అధికంగా ఉండటంతో వలి షాప్‌నకు గిరాకీ తక్కువగానే ఉంటోంది. మొత్తమ్మీద విధిని ఎదురించి ధైర్యంగా ముందుకు వెళ్తున్న ఈ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top