15 నుంచి ఒంటిపూట బడులు

Half Days Schools In AP From 15th Of March - Sakshi

16 నుంచి ఎలిమెంటరీ విద్యార్థులకు బ్రిడ్జికోర్సు

ఆట, పాటలతో విద్యార్థులకు కొత్త ఉత్సాహం

23న తల్లిదండ్రులకు ప్రగతి నివేదికలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒంటి పూట బడులు’ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ వి.చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటిపూట బడుల సమయంలో అనుసరించాల్సిన విధులను అందులో పేర్కొన్నారు.
- ఒంటిపూట బడులపై సమయ పట్టికను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలి.
- ఏప్రిల్‌ రెండో శనివారం సెలవు ఉండదు. 
- వేసవి ఎండల దృష్ట్యా పాఠశాలల్లో మంచినీటిని అందుబాటులో ఉంచాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులను ఆరుబయట, చెట్లకింద నిర్వహించరాదు.
- విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా స్కూళ్లలో ఓరల్‌ రీ–హైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌) ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలి.
- మధ్యాహ్న భోజనాన్ని ఒంటిపూట బడి సమయం ముగిసేలోగా తయారు చేయించి విద్యార్థులకు అందించాలి. 
- ప్రాథమిక పాఠశాలలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు పనిచేయాలి.
- ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు జరపాలి.

16 నుంచి బ్రిడ్జికోర్సులు
ఎలిమెంటరీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి నిర్వహించే బ్రిడ్జి కోర్సులకు సంబంధించిన కొన్ని విధివిధానాలను విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఆడుతూ పాడుతూ ఆయా అంశాలను నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో చదువుపై మరింత అభిరుచిని కలిగించేందుకు ప్రభుత్వం ఈ బ్రిడ్జికోర్సును ఏర్పాటు చేసింది.
- పిల్లల్లోని సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఈనెల 16న విద్యార్థులకు బేస్‌లైన్‌ టెస్టు ఉంటుంది. పరీక్ష మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. 
- బేస్‌లైన్‌ టెస్టులో సున్నా వచ్చినా టీచర్లకు, విద్యార్థులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బేస్‌లైన్‌ టెస్టు విద్యార్థులు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే.
- బ్రిడ్జి కోర్సు జరిగే 30 రోజుల తర్వాత విద్యార్థుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడాలి. ఇందుకు ఏప్రిల్‌ 22న ఎండ్‌లైన్‌ పరీక్ష జరుగుతుంది.
- సింగిల్‌ టీచర్‌ ఉన్న చోట కూడా ఈ బ్రిడ్జికోర్సు కొనసాగించాలి.
- ఒకటి రెండు తరగతులకు ఈవీఎస్‌ ఉండదు.
- బ్రిడ్జి కోర్సు సమయంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లతో అవసరం లేదు. వర్కుబుక్స్‌ను, టీచర్లకు హ్యాండ్‌ బుక్స్‌ను విద్యాశాఖ అందిస్తుంది.
- ఏప్రిల్‌ 23న పేరెంట్స్‌ యాజమాన్య కమిటీ (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తల్లిదం డ్రులకు తెలియజేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top