గుట్టుగా గుట్కా దందా

Gutka Business In Anantapur District Is Booming - Sakshi

కర్ణాటక నుంచి జిల్లాలోకి భారీగా సరఫరా 

అనుమానం రాకుండా రవాణా చేస్తున్న అక్రమార్కులు 

మామూళ్ల మత్తులో పోలీసులు 

సాక్షి, కదిరి: జిల్లాలో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. గుట్కాపై నిషేధం ఉన్నా గత ప్రభుత్వంలో దానిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గుట్కా రవాణాతో పాటు వ్యాపారం జోరుగా సాగేది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే గుట్కా, మట్కా, పబ్బులు, క్లబ్బు లు లాంటి వాటిపై ప్రత్యే క దృష్టిసారించాలని పోలీసుశాఖను గట్టి గా ఆదేశించారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు కూడా సీఎం ఆదేశాల ను ఛాలెం జ్‌గా తీసుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారిం చారు. పక్క రాష్ట్రమైన కర్ణాట క నుంచి అక్రమంగా జిల్లాలోకి గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తూ గుట్కా దందా కొందరు వ్యాపారులు యథేచ్ఛగా చేస్తున్నారు. 

వ్యాపారాన్ని వదులుకోడానికి నో.. 
కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలోకి దిగి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్న గుట్కా మాఫియా ఈ వ్యాపారాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని మరింత సీరియస్‌గా తీసుకొని ప్రతినెలా లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తే వారం తిరక్కుండానే బెయిల్‌పై వచ్చేస్తామనే ధీమాతో తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని గతంలో ఎవరైతే నిర్వహించేవారో ఇప్పటికీ వారే నడుపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల అండదండలు వీరికి పుష్కలంగా ఉండేవి. ఇప్పటికీ కొందరు పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ గుట్కా మాఫియాకు సహకరిస్తున్నట్లు సమాచారం. 

అధిక ధరకు విక్రయాలు 
పొగాకు ఉత్పత్తులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా.. వాటి బారినపడి అనారోగ్యానికి గురయ్యేవారికి పెట్టే ఖర్చే రెట్టింపు అవుతోందన్న కారణంతోనే ప్రభుత్వం గుట్కాపై నిషేధం విధించింది. అయితే వీటి అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో ఎలా బహిరంగంగా విక్రయించేవారో ఇప్పుడుకూడా అలానే అమ్ముతున్నారు. దీనికి పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేదు. గతంలో రూ.5కు దొరికే గుట్కా ప్యాకెట్‌ నిషేధం సాకుతో ఇప్పుడు అధిక(రూ20) ధరకు విక్రయిస్తున్నారు. కాలేజీ కుర్రాళ్ల దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపిన వృద్ధుల వరకూ చాలా మంది గుట్కాకు అలవాటు పడ్డారు.

గుట్కా నిషేధం అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసులే చాలా మంది గుట్కాకు అలవాటు పడ్డారు. దీంతో గుట్కా దందాకు ఎదురులేకుండా సాగుతోంది. జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఆ రాష్ట్రం నుండి గుట్కా పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీంతో నిషేధం కాస్తా ‘గుట్కా’య స్వాహాగా మారిపోయింది. ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా ప్యాకెట్లను ఒక్కోసారి పాలవ్యాన్లలో తరలిస్తే, ఇంకోసారి ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

నామమాత్రపు తనిఖీలే 
సెక్షన్‌ 30(2) 2006 ఆహార భద్రతా చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా నిషేధం అమలులో ఉంది. వాటిని తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠన చర్యలు తప్పవు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, రవాణా, కార్మిక, పురపాలక, పంచాయతీరాజ్, నిఘా, వాణిజ్య పన్నుల శాఖల సమన్వయంతో తనిఖీలు చేయాలనే ఆదేశాలున్నాయి. నిషేధం అమలు బాధ్యత ఇన్ని శాఖలపై ఉన్నప్పటికీ జిల్లాలో తనిఖీలు మాత్రం నామమాత్రమే. దీంతో గుట్కా మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజలను గుట్కా బారి నుంచి కాపాడుతుందని ఆశిద్దాం.  

ఆగని అమ్మకాలు 
గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా హీరా, మానిక్‌చంద్, చాంపియన్, బాషా, విమల్, హాన్స్, పాన్‌పరాగ్, రాజా, ఎంసీ, చైనీ ఖైనీ ఇలా పలు కంపెనీలకు సంబంధించి ప్రతిరోజూ 1.20 లక్షల గుట్కా ప్యాకెట్‌లు అమ్ముడు పోయేవని ఆయా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో ప్యాకెట్‌లో 6 పొట్లాలు చొప్పున 7.20 లక్షల గుట్కా పొట్లాల అమ్మకాలు జరిగేవని అంటున్నారు. అప్పట్లో ఒక్కో పొట్లం రూ.5 చొప్పున రోజుకు రూ.36 లక్షల విక్రయాలు జరిగేవని వారు లెక్కలేసి మరీ చెబుతున్నారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గుట్కాలపై నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించడంతో గతంలో బహిరంగంగా జరిగే ఈ వ్యాపారం ఇప్పుడు కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, మడకశిర, అనంతపురం, శింగనమల, రాయదుర్గం, హిందూపురం తదితర ప్రాంతాల్లో గుట్టుగా సాగుతోంది. పోలీసుల తనిఖీలు ముమ్మరంగా ఉన్నాయని చెబుతూ ఒక్కో గుట్కా పొట్లం రూ.15 నుంచి రూ.20 దాకా అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు ఎంత వ్యాపారం జరుతుతుందో మీరే అంచనా వేయండని చెబుతున్నారు. గుట్కా లోగుట్టు వెనుక ఎంతో మందికి మామూళ్లు ముట్టజెబుతున్న విషయం కూడా వారి నోటి వెంట వినబడుతోంది. మరోవైపు గుట్కా జోలికెళ్తే గుటుక్కు మనేది ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top