మంత్రాలతో కుటుంబ సభ్యులను హతమారుస్తున్నాడనే అనుమానంతో తాతను పట్టపగలే మనవడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది.
తండ్రి కాష్టం వద్దనే గొడ్డలితో నరికి చంపిన వైనం
దౌల్తాబాద్, న్యూస్‌లైన్ : మంత్రాలతో కుటుంబ సభ్యులను హతమారుస్తున్నాడనే అనుమానంతో తాతను పట్టపగలే మనవడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది.
ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు.. ఆవుల మల్లయ్య(80), మల్లమ్మ దంపతులు కుటుంబం కొన్నేళ్లుగా దౌల్తాబాద్‌లో స్థిరపడింది. కుమార్తె లింగమ్మ, అల్లుడు స్వామిలు మల్లయ్య పొరుగింటిలో నివాసం ఉంటున్నారు. మల్లయ్య మంత్రాలు వేస్తాడన్న అనుమానం ఇటు కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులకు కూడా ఉంది. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మల్లయ్య అల్లుడు స్వామి మృతి చెందాడు. శనివారం ఆయన దశదినకర్మ జరగాల్సి ఉంది.
తెల్లవారుజామున మల్లయ్య పెద్ద మనుమడు మహేష్ కుమార్తె మూడు నెలల రేవతి అకస్మాత్తుగా మృతి చెందింది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం పొలం వద్ద ఉన్న స్వామి కాష్టం పక్కన మల్లయ్య మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృతుడి మెడపై గొడ్డలి గాయమైంది. మృతదేహం పక్కన నిమ్మకాయలు, పసుపు, కల్లు సీసాలు పడి ఉన్నాయి. కాగా.. మల్లయ్య చిన్న మనవడు గణేష్ ఇంటికెళ్లి ‘మీ నాన్నను, చిన్నారిని చంపిన విధంగా నిన్నూ చంపుతానని తాత బెదిరించాడు’ దీంతో తానే అతడిని హతమార్చానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.