ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పండగ..!

Government Schools Pre Admissions In Vizianagaram - Sakshi

విజయనగరం అర్బన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు ప్రవేశాలకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మన ఊరిలో ఉన్న బడిని మనమే కాపాడుకుందాం.. రూ.వేలు పోసి చదువుల కొనుగోలును మానుకుందాం.. ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేద్దాం అంటూ ప్రచారం ముమ్మరం చేసింది. దీనికోసం సోమవారం నుంచి ‘మన ఊరు.. మనబడి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో ప్రభుత్వ, మండల పరిషత్‌ ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను భాగస్వాములను చేసింది. ఆరు నుంచి 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లలను బడిలో చేర్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్ధేశం. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు ఉపాధ్యాయులు వివరిస్తారు. పిల్లలందరినీ ప్రభుత్వ బడికి పంపించేలా ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ నెల 23 నుంచి ప్రవేశాలు కల్పిస్తారు. 

56,280 మందిని చేర్పించడమే లక్ష్యం
జిల్లాలో చేపట్టిన వివిధ సర్వేల ఆధారంగా గుర్తించిన 56,278 మంది విద్యార్థులను ప్రభు త్వ పాఠశాల్లో చేర్పించాలన్నదే విద్యాశాఖ లక్ష్యం. జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధి లోని 3,418 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఒకటో తరగతికి 28,882 మందిని, ఐదు నుంచి ఆరో తరగతికి 22,404 మందిని, ఎనిమిది నుంచి తొమ్మిదో తరగతికి 2,463 మందిని చేర్పించాలి. బడిమానేసిన వివిధ వయస్సుల వారు 2,529 మందికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రత్యేక కమిటీల నియామకం.. సర్కారు బడిలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ అమలుకు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో కమిటీలను నియమిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈఓ వైస్‌ చైర్మన్‌గా, ఎస్‌ఎస్‌సీ పీఓ కన్వీనర్‌గా, డీపీఓ, జెడ్పీ సీఈఓ, ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీఓ అధ్యక్షుడిగా, ఎంఈఓ ఉపాధ్యక్షుడిగా, ఎస్‌ఎంసీ సభ్యుడు కన్వీనర్‌గా, క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు. ఇక పాఠశాల స్థాయిలో అధ్యక్షుడిగా హెచ్‌ఎం, ఉపాధ్యక్షుడిగా ఎస్‌ఎంసీ అధ్యక్షుడు, కన్వీనర్‌గా ఉపాధ్యాయుడు, సభ్యురాలిగా అంగన్‌వాడీ కార్యకర్త ఉంటారు. 

కార్యాచరణ ఇలా... 

  • ఈ నెల 23 నుంచి 30 వరకు రోజువారీ అమలు చేయాల్సిన కార్యాచరణను నాలుగు ప్రక్రియలుగా విభజించి లక్ష్యాలను నిర్దేశించింది. 
  • 23న స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వారి సమక్షంలో ప్రవేశాలు కొన్నైనా కల్పించాలి. ∙24 నుంచి 26వ తేదీ వరకు పాఠశాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు సర్కార్‌ బడులను సందర్శించాలి.
  • 25న ఐదో తరగతి విద్యార్థులను 6వ తరగతిలో చేర్పించడంపై దృష్టిపెట్టాలి. 
  • 26న ఏడు నుంచి ఎనిమిదికి, ఎనిమిది నుంచి తొమ్మిదో తరగతి ప్రవేశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి.
  • 27న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో  సౌకర్యాలను ప్రచారం చేసి ప్రవేశాలకు ఒప్పించాలి.   
  • 28న బడిబయట విద్యార్థుల వద్దకు వెళ్లి ప్రవేశాలు కల్పించాలి.  29న మురికి వాడల్లో పిల్లలను చైతన్యపరిచి ప్రవేశాలు చేపట్టాలి.
  • 29న జ్ఞానధార కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. సమీప కేంద్రాలకు సంబంధిత విద్యార్థులను చేర్పించాలి.
  • 30న వారం రోజుల పాటు చేపట్టిన ప్రవేశాల వివరాలను మండల స్థాయి సీఎస్‌ఈ  లో పొందుపరచాలి. ∙23 నుంచి 30 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు విధిగా పాఠశాలల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటూ íపిల్లలను బడిలో చేర్చుకుని వారికి ప్రవేశ ధ్రువపత్రాలను జారీచేయాలి. 

ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో బోధన 
రానున్న విద్యా సంత్సరం ఒకటో తరగతి నుంచి సమాంతర ఆంగ్ల మాధ్యమ విద్యను 139 మోడల్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెడుతున్నాం. ఈ అంశంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. దీంతోపాటు జ్ఞానధార కార్యక్రమ ప్రాధాన్యత చెప్పాలని సూచించాం.  ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ పథకాలను వివరిస్తూ ఎక్కువ మందిని బడిలో చేర్పించాలన్నది విద్యాశాఖ లక్ష్యం.
– జీ.నాగమణి, డీఈఓ  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top