చంద్రబాబు ఇంద్ర భవనానికి సర్కారు సొమ్మే | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇంద్ర భవనానికి సర్కారు సొమ్మే

Published Wed, Apr 3 2019 4:12 AM

Government money to the Chandrababu Own House In Hyderabad - Sakshi

అది హైదరాబాద్‌లోనే అతి ఖరీదైన జూబ్లీహిల్స్‌ ప్రాంతం. అక్కడ రోడ్డు నంబర్‌ 65లో సుమారుగా అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన ఆధునిక భవంతి.... అందులో...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్‌.. కళ్లు చెదిరే షాండ్లియర్స్‌... ఇటాలియన్‌ మార్బుల్స్‌... విశాలమైన గదుల్లో ఎటుచూసినా అద్భుతమైన కళాకృతులు.. ముట్టుకుంటే మాసిపోతాయా అన్నట్లుండే ఖరీదైన సామగ్రి... ఇక టెర్రస్‌ కూడా ఖరీదైనదే.. దానిపై అరుదైన విదేశీ మొక్కలతో కూడిన పచ్చిక బయలు.. ఇవన్నీ చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఇంతకీ ఎవరిదీ ఇంద్రభవనం? ఇంకెవరిది? సీఎం చంద్రబాబుది.

14 ఏళ్లు ముఖ్యమంత్రి.. కొడుకు ఎమ్మెల్సీ.. ఐటీ మంత్రి.. భార్యది పాల వ్యాపారం.. కోడలు కూరగాయల వ్యాపారం.. ఇంతమంది సంపాదిస్తున్నారు.. ఆమాత్రం బిల్డింగ్‌ కట్టుకోలేరా అని ఎవరైనా అనుకోవచ్చు...

కానీ..కాణీ ఖర్చు కాకుండా అలాంటి ఇంద్ర భవనం ఎవరైనా కట్టగలరా..? నయాపైసా ఖర్చు లేకుండా ప్రపంచంలోనే ఖరీదైన ఇంటీరియర్‌ అమర్చుకోగలరా..?అసలు జేబులో రూపాయి తీయకుండా జూబ్లీహిల్స్‌లో భవనమా అని ఆశ్చర్యపోకండి..ఇవన్నీ సాధ్యమేనని చంద్రబాబుగారు నిరూపించారు. అదెలాగో చూడండి..

సాక్షి, అమరావతి: చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం నుంచి ఇంటీరియర్స్‌ పనులన్నీ చేసిపెట్టింది ఆషామాషీ సంస్థ కాదు.. ఇంటి ప్లాన్‌ నుంచి నిర్మాణం, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్‌ సరఫరా వరకూ అన్నీ అదే చూసింది. అదే.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ జెనిసిస్‌ ప్లానర్స్‌.. ఈ పేరెక్కడో విన్నట్లుంది కదూ.. రాజధాని అమరావతికి డిజైన్లను రూపొందించిన సంస్థ ఇది. అదేమిటి.. ఆ సంస్థ చంద్రబాబు ఇంటికి ఎందుకు ఖర్చుపెట్టింది? తెరవెనుక ఏం జరిగింది? 

కావాల్సిన వారి కోసం మకీని తప్పించారు..
రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలకు అవసరమైన డిజైన్ల రూపకల్పనకు గాను తొలుత జపాన్‌లోని టోక్యోకు చెందిన మకి అండ్‌ అసోసియేట్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసింది.. ఇందుకోసం ఆ సంస్థకు రూ.87 కోట్లు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించారు. అయితే తనకు కావాల్సిన సంస్థలను పార్టనర్స్‌గా చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మకి అసోసియేట్స్‌కి షరతు విధించారు.  ముంబైకి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన జెనిసిస్‌ ప్లానర్స్‌ను భాగస్వాములుగా చేర్చుకోవాలని చంద్రబాబు కండిషన్‌ పెట్టారట. ఇందుకు మకీ ససేమిరా అంది. దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహించారు. మకీ అసోసియేట్స్‌ను డిజైన్ల రూపకల్పన బాధ్యత నుంచి ఏకపక్షంగా తప్పించేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అప్పట్లోనే మకీ అసోసియేట్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అవినీతి కార్యక్రమాలకు తమపై ఒత్తిడి తెచ్చారని, ఇందుకు అంగీకరించపోవడంతో ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారని మకీ ఆ లేఖలో స్పష్టం చేసింది. కాగా మకీని తప్పించిన నేపథ్యంలో డిజైన్ల కోసం కొత్తగా లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ను ఎంపిక చేశారు. ఈ నార్మన్‌ ఫోస్టర్‌కు స్థానిక భాగస్వామిగా హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను అధికారికంగా చేర్చారు. ఆ తర్వాత ముఖ్యనేత ఆదేశాలతో హైదరాబాద్‌కు చెందిన జెనిసిస్‌ ప్లానర్స్‌ను కూడా భాగస్వామిని చేశారు. 

రూ.250 కోట్లకు పెంచింది అందుకేనా...
రాజధాని డిజైన్లను అధికారికంగా నార్మన్‌ ఫోస్టర్, హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత రహస్యంగా జెనిసిస్‌ను ఎందుకు చేర్చాల్సి వచ్చిందో చెప్పాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోస్టర్‌ తొలుత రూ.67.86 కోట్ల ఫీజుకు అంగీకరించి, సంప్రదింపుల తర్వాత రూ.60.72 కోట్లకే డిజైన్లు ఇచ్చేందుకు అంగీకరించిందంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ ఆ మొత్తాన్ని రూ.112.58 కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందో.. అది కూడా కాదని.. రూ. 250 కోట్లకు పెంచేయడమేమిటో.. అందులోనూ రూ.210 కోట్లు హడావిడిగా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో సమాధానం లేని ప్రశ్నలు... ఆడిట్‌లో స్పష్టంగా దొరికిపోయిన ఆ రూ.130 కోట్లు మాత్రం జెనిసిస్‌ ద్వారా ‘ఇంటి’బాట పట్టాయని అధికారులు అంటున్నారు.

రూ.60 కోట్ల నుంచి రూ.250 కోట్లకు.. 
నార్మన్‌ ఫోస్టర్‌ రూ.67.86 కోట్లకే రాజధాని డిజైన్లను రూపొందించేందుకు కోట్‌ చేసిందని, అయితే సంప్రదింపుల అనంతరం రూ.60.72 కోట్లకు ఆ మొత్తాన్ని తగ్గించామని, అంటే మకీ అసోసియేట్స్‌ కన్నా చాలా తక్కువకు నార్మన్‌ ఫోస్టర్‌ను ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 15–12–2016వ తేదీన జరిగిన ఏపీసీఆర్‌డీఏ 12వ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం మినిట్స్‌లో దీనిని పొందుపరిచారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. 2017 జూన్‌ 16వ తేదీన జరిగిన ఏపీసీఆర్‌డీఏ 10వ అథారిటీ సమావేశంలో నార్మర్‌ ఫోస్టర్‌ ఫీజును రెట్టింపునకు పైగా రూ.112.58 కోట్లకు పెంచారు. కానీ ఇప్పటివరకు నార్మన్‌ ఫోస్టర్, హఫీజ్‌ కాంట్రాక్టర్, జెనిసిస్‌కు మొత్తం రూ.210 కోట్ల చెల్లింపులు చేయడం గమనార్హం.

ఈ చెల్లింపులు సీఆర్‌డీఏ ఆడిట్‌ నివేదికల్లో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటివరకు చెల్లించిన రూ.210 కోట్లలో హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు రూ.40 కోట్లు ఇస్తే జెనిసిస్‌కు రూ.90 కోట్లు చెల్లించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ మొత్తం రూ.130 కోట్లూ జెనిసిస్‌ ద్వారా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ‘ఇంద్ర’భవనం కోసం మళ్లించేశారంటూ అధికార వర్గాలు ఇప్పుడు గుట్టు కాస్తా విప్పేశాయి. జెనిసిస్‌ ప్లానర్స్‌ అధినేత  ‘ముఖ్య’ నేతకు సన్నిహితుడు కావడంతో, హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను జత చేసి ఈ తతంగం అంతా నడిపించారని ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి అధికారి ఒకరు చెప్పారు. జెనిసిస్‌ కోసం, తద్వారా ముఖ్యనేత కోసమే.. రాజధాని డిజైన్ల ఫీజును పెంచుకుంటూ వెళ్లినట్టుగా స్పష్టం అవుతోందని, ఇప్పటికే రూ.210 కోట్లు చెల్లించగా మరో రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement