భూకబ్జాకు భారీ స్కెచ్! | government lands occupy in the leaders | Sakshi
Sakshi News home page

భూకబ్జాకు భారీ స్కెచ్!

Jun 25 2016 12:52 AM | Updated on Sep 15 2018 3:51 PM

భూకబ్జాకు భారీ స్కెచ్! - Sakshi

భూకబ్జాకు భారీ స్కెచ్!

ప్రత్తిపాడు మండలం నడింపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై 184 సర్వే నంబరులో 29.65 ఎకరాల ప్రభుత్వ భూమి.....

నడింపాలెంలో ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను
2.40 ఎకరాలకు నకిలీ వ్యవసాయ అప్పగింత పట్టాలు
రాజముద్ర (సీల్), స్టాంపులు అన్నీ నకిలీవేనని నిర్ధారణ
తహశీల్దార్ సంతకం సైతం ఫోర్జరీ.. డీకే రిజిస్టరు మాయం
సర్పంచ్ చొరవతో వెలుగులోకి వచ్చిన వైనం...
పూర్తి విచారణకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు
 

నడింపాలెంలో నకిలీ పట్టాల కుంభకోణం వెలుగుచూసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు నకిలీ పట్టాలను సృష్టించారు. ఏకంగా తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలతో ప్రభుత్వ భూమిని కాజేసే పన్నాగం పన్నారు.
 
 
ప్రత్తిపాడు
: ప్రత్తిపాడు మండలం నడింపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై 184 సర్వే నంబరులో 29.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ఆ భూమిని కాజేసేందుకు భారీ స్కెచ్ వేశారు. రికార్డుల్లో లేని సర్వే నంబర్లు సృష్టించి 2.40 ఎకరాల భూ దోపిడీకి పాల్పడ్డారు. 184-3-ఏ1ఏ సర్వే నంబరుతో నకిలీ సబ్‌డివిజను సృష్టించి 2015 ఫిబ్రవరి 16న ఒక్కొక్కరికీ 30 సెంట్లు చొప్పున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎనిమిది మంది పేర్లతో 2.40 ఎకరాలకు నకిలీ పట్టాలను (వ్యవసాయ అప్పగింత పట్టాలు) పుట్టించారు.


సంతకాలు, స్టాంపులు, సీల్స్.. అన్నీ నకిలీవే..
నడింపాలెంలో వెలుగులోకి వచ్చిన నకిలీ పట్టాలను చూసిన రెవెన్యూ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. పట్టాలపై ఉన్న రాజముద్ర (సీల్), తహశీల్దార్ పేరుతో ఉన్న స్టాంపులు అన్నీ నకిలీవేనని తేల్చారు. వీటితో పాటు ఏకంగా తహశీల్దార్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.


డీకే రిజిస్టర్ మాయం..
ఇదిలా ఉంటే గ్రామంలో ఎవరికైనా నివేశన స్థలాలు లేదా వ్యవసాయ భూముల పట్టాలు అప్పగించిన సమయంలో లబ్ధిదారుల పూర్తి వివరాలను డీకే రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నడింపాలెం గ్రామానికి సంబంధించిన డీకే రిజిస్టర్ మాయమైంది. నాలుగు రోజులుగా పట్టాల పంపిణీకి సంబంధించిన రిజిస్టర్‌ల కోసం వీఆర్వోలు వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది. దీంతో కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ దొంగ పట్టాలు ఎంత మందికి ఇచ్చారు? ఇచ్చిన వారు ఎవరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు కార్యాలయంలోనే అస్మదీయులు ఉన్నారా? అన్న అనుమానాలూ లేకపోలేదు.


సర్పంచ్ చొరవతో వెలుగులోకి..
ఈ నకిలీ కుంభకోణం గ్రామ సర్పంచ్ నేలపాటి శౌరీలు చొరవతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు ప్రభుత్వభూమిలో కొందరు పొక్లెయినర్‌లు, ట్రాక్టర్లుతో భూమిని చదును చేయించడంతో గ్రామంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సర్పంచ్ శౌరీలు రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు తహశీల్దార్ పద్మావతిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి తహశీల్దార్ ఏసుబాబు (ప్రస్తుత దుర్గి తహశీల్దార్)ను కలిసి తనకు లభించిన నకిలీ పట్టాలను చూపించారు. దీంతో నిజం నిగ్గుతేలిపోయింది.


పట్టాలను, పట్టాలపై ఉన్న సంతకాలు పరిశీలించిన దుర్గి తహశీల్దార్  ఏసుబాబు అవి తన సంతకాలు కావని, అసలు తన హయాంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు గానీ, డీకే పట్టాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ప్రత్తిపాడు తహశీల్దార్‌కు ఓ లేఖ  రాశారు. తన సంతకాలను ఎవరో ఫోర్జరీ చేశారని, నిజాలను నిగ్గు తేల్చి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
 
 
ఆ పట్టాలు నకిలీవే..
నడింపాలెంలో వెలుగు చూసిన వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు నకిలీవే. పట్టాలు పరిశీలించాను. అనుమానం వచ్చి అప్పటి తహశీల్దార్ ఏసుబాబుని అడిగాను. తన హయాంలో ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. దానికితోడు అందుకు సంబంధించిన రిజిస్టర్‌లు, రికార్డులు కూడా కార్యాలయంలో ఏమీలేవు. అందుచేత కచ్చితంగా అవి నకిలీ పట్టాలే. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాను.  - పద్మావతి, తహశీల్దార్, ప్రత్తిపాడు మండలం.
 
 
డీకే రిజిస్టర్ లేదు
మా రికార్డుల్లో 184-3-ఏ1ఏ సర్వే నంబరు లేనేలేదు. ఇది నకిలీ సర్వే నంబరు. అయినా అసలు 2015లో పట్టాలు ఇచ్చినట్లుగా కార్యాలయంలో రికార్డులేమీ లేవు.  నాలుగు రోజులుగా డీకే రిజిస్టర్ కోసం వెతుకుతున్నాం. కనిపించలేదు. అందుచేత ఇవి నకిలీవిగానే భావిస్తున్నాం.  184 సర్వే నంబరులో ఉన్న భూమి మాత్రం ప్రభుత్వ భూమే. - కె జీవనజ్యోతి, ఇన్‌చార్జి వీఆర్వో, నడింపాలెం గ్రామం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement