ఆక్రమణలు..అమ్మకాలు

Government Lands Are Going In Private Hands Illegally - Sakshi

నాయకులకు అధికారుల అండ

రూ.కోట్లలో లావాదేవీలు

అడ్డాగా మారిన గొలగాం

తుమ్మపాల(అనకాపల్లి) : ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు అమ్మకాలకు అడ్డాగా మారింది మండలంలోని గొలగాం పంచాయతీ. అనకాపల్లి పట్టణానికి చెందిన అధికారపార్టీ నాయకులు కొందరు ఇటీవల ఈ గ్రామంలోని సర్వే నెంబరు 137లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అందులోని భారీ వృక్షాలను తొలగించి లేఅవుట్‌ వేశారు. అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన పరిణామం మరువక ముందే మరో వ్యవహారం వెలుగుచూసింది. మండలంలో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నది గొలగాంలోనే. ఈ గ్రామానికి సమీపంలో కోడూరులో ఏపీఐఐసీ, అనకాపల్లి–ఆనందపురం రహదారి విస్తరణ వంటి అంశాలు మూలంగా ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈమేరకు  సర్వే నెంబరు 88లో ఉన్న 60 ఎకరాల కొండపోరంబోకు భూమిలో కొంత గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారు. సుమారు 10 ఎకరాల మేర లేఅవుట్‌ వేసి రూ. లక్షలకు అమ్మేశారు. సుమారు రూ.రెండు కోట్లమేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు చోటా మోటా నాయకులు ఇదే బాట పడుతున్నారు. కొండను చదును చేసి దొంగపట్టాలు  సృష్టించి జోరుగా విక్రయాలు చేపడుతున్నారు. సెంటు రూ.లక్ష చొప్పున 3 నుంచి 6 సెంట్లు ఒక్కో ప్లాటుగా రూపొందించారు. వీటి లావాదేవీలు జాతరను తలపిస్తున్నాయి. వీటిల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి మున్ముందు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పంచాయతీ, ఇతర శాఖల అధికారులు ఇంటి పన్ను, విద్యుత్, మంచినీటి సౌకర్యం ఎంచక్కా కల్పిస్తున్నారు. అనకాపల్లికి కేవలం 4 కిలో మీటర్ల దూరంలో తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు లభిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పలువురు ఈ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని గ్రామస్ధాయి అధికారుల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గ్రామాభివృద్ధిలో భాగంగా అన్ని ఇళ్లకు సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్నారు. వీఆర్వో ఓ అడుగు ముందుకేసి ఇక్కడి నిర్మాణాలకు ఎల్‌పీసీలు కూడా మంజూరు చేశామన్నారు. అంటే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారన్నమాట. అధికారులు పాలకపార్టీ నాయకులతో కుమ్మక్కవుతున్నారనడానికి ఇది తార్కాణంగా ఉంటోంది.

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు..

గొలగాంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి విక్రయిస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్‌ హౌసింగ్‌లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన ఎల్‌పీసీలతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదు. అలా చేపడితే తొలగిస్తాం. ఇటీవల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాల పరిధిలో ఉన్న  ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్‌లు వేసి అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తాం.
బి.సత్యనారాయణ, తహసీల్దార్, అనకాపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top