ఫ్రీజింగ్‌.!

Government Funds Freezed in YSR Kadapa - Sakshi

ప్రభుత్వ ఖజానాలో 2నెలలుగా ఆగిపోయిన చెల్లింపులు

జిల్లాలో రూ.100కోట్ల బిల్లులకు బ్రేక్‌

ఖజానా ఖాళీ అయినందువల్లేనా..

కడప కార్పొరేషన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రెండు మాసాలుగా చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఖజానా ఖాళీ అవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని బిల్లులను ఆపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన జీతాలను కూడా ఈనెల 13వ తేదీ విడుదల చేశారు. గత ఏడాది నుంచి అన్ని బిల్లులు మాన్యువల్‌గా కాకుండా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మంజూరు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, ఇతర శాఖల్లోని బిల్లులన్నీ దీని ద్వారానే జారీ చేస్తున్నారు. ఒక్క వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే రూ.100కోట్లకు పైగా బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో ఆగిపోయినట్లు తెలుస్తోంది.  గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి.

మున్సిపాలిటీల్లో అయితే 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, బీపీఎస్‌ నిధుల కింద చేపట్టిన పనులకు కూడా బిల్లులు రావడం లేదు. ఒక్క కడప కార్పొరేషన్‌లోనే సుమారు రూ.3కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రూ.35కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. అగ్రిమెంట్‌ మేరకు గడువు లోపు పనులు చేయాలని ఒత్తిడి చేసి పనులు చేయించారని, అప్పులు సప్పులు చేసి పనులు చేస్తే ఇప్పుడు బిల్లులు రాకుండా ఆపేశారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఐసీడీఎస్, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లోనే సుమారు రూ.100 కోట్ల బిల్లులు రావాల్సి ఉంటే ఇక మైనర్, మేజర్‌ ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్లు్యఎస్, పంచాయితీరాజ్, హౌసింగ్,  పబ్లిక్‌ హెల్త్, వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ, జిల్లా పరిషత్‌ వంటి ఇతర శాఖల్లో మరో రెండువందల కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఖాజానా ఖాళీ అవడం వల్లే చెల్లింపులన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో కేటాయించకపోయినా చాలా పనులను ప్రభుత్వం చేసేస్తోంది. వచ్చిన ఆదాయమంతా జీతాలకే సరిపోతుండటంతో మిగిలిన వ్యయానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి కూడా ఆశించినంత స్పందన రాకపోవడంతోనే ప్రభుత్వం చెల్లింపులన్నీ ఆపేసినట్లు తెలుస్తోంది.

అంగన్‌వాడీలకు 3 మాసాలుగా అందని వేతనాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, హెల్పర్లకు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో ఇటీవల వారు రెండు రోజులు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. జిల్లాలో 3621 అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 7242 మంది కార్యకర్తలు, హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి మూడుమాసాలుగా రూ.16.29కోట్లు వేతనాలు రావాల్సి ఉంది. అన్నిశాఖల్లోని ఉద్యోగులు, కార్మికులకు ప్రతినెలా జీతాలిస్తున్న ప్రభుత్వం అంగన్‌వాడీలకు మాత్రమే ఇలా జీతాలు ఆపేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఉపాధి కూలీ దక్కలేదు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూడా మూడు మాసాలుగా వేతనాలు అందలేదు. జిల్లాలో 5,62,899 కుటుంబాల్లో 11,12,279 మంది కూలీలు ఉన్నారు. వీరికి మూడు నెలలుగా సుమారు రూ.39కోట్ల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయడానికే ఐసీడీఎస్, డ్వామా నిధులు ఆపేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ...
ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు  ప్రకటిస్తుండటం పట్ల ఆర్థిక వేత్తలు విస్తుపోతున్నారు. జీతాలు, ఉన్న బిల్లులు ఇవ్వడానికే నిధులు లేకుంటే కొత్తగా పింఛన్లు రూ.2వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా కొత్తవి కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top