ఇక స్కూల్‌ కమిటీలకు ఎన్నికలు...

Government Decided To Restarting Of SMC elections In Schools - Sakshi

సాక్షి, విజయనగరం : ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యాకమిటీల(ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలలకు దసరా తరువాత కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ చిన్న వీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన విధి విధానాలు రూపొం దించి రెండురోజుల వర్క్‌షాపు ఇటీవల నిర్వహించారు.

ఎస్‌ఎంసీ ఎన్నికల అధి కారులుగా ఎంఈఓ, సీనియర్‌ ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఇంతవరకు ఉన్న ఎస్‌ఎంసీ సభ్యుల కాలపరిమితి గతేడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు.  ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి విద్యాశాఖపై సారిస్తున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో వాటి అభివృద్ధికి కీలకపాత్ర వహించాల్సిన ఎస్‌ఎంసీలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 2,717 ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం కసరత్తు చేస్తోంది. 

ఎన్నికల నిర్వహణ ఇలా...
విద్యాకమిటీ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాధమిక పాఠశాలలో గరిష్టంగా 15 మంది సభ్యులుండాలి. ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి లో ఎస్‌ఎంసీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తు తం అమ్మ ఒడి పథకం అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేలా చూడాల్సి ఉంటుంది.

కమిటీ సభ్యులకు శిక్షణ
ఎన్నికైన కమిటీలకు మండల కేంద్రాలలో శిక్షణ నిర్వహించనున్నారు. తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంట్లను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయునితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి.  బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాలు పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది.  ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. 

కొన్ని పాఠశాలల్లో అయితే మొక్కుబడిగా హాజరై సంతకాలు లేదా వేలిముద్రలు వేసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పింది విని వెళ్లేవారు. అంతకుమించి పాఠశాలల అభివృద్ధిలో ఎస్‌ఎంసీలు క్రయాశీలకంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎస్‌ఎంసీలను మరింత బాధ్యతాయుతంగా రూపొందించాలని ప్రభుత్వ ఆలోచన. ఎన్నికైన వెంటనే వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఎన్నికైన సభ్యులకు శిక్షణ
స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌ఎంసీ)ల ఎన్నిక నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.తాజాగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలను క్రోడీకరిస్తున్నాం. ఎన్ని కల నిర్వాహణకు అవసరమైన చర్యలపై సమీక్షిస్తున్నాం. ఎస్‌ఎంసీల ఎన్నికలను అక్టోబర్‌లో ముగించి ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తాం.      
– ఎం.కృష్ణమూర్తి నాయుడు, ఎస్‌ఎస్‌ఏ పీఓ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top