జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రి బోధన్‌కు తరలింపు | Governement Hospital is shifted to Bodhan | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రి బోధన్‌కు తరలింపు

Sep 29 2013 4:56 AM | Updated on Sep 1 2017 11:08 PM

జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రిని మంత్రి పి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమైన బోధన్‌కు తరలించడం దాదాపుగా ఖరారైంది.

కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రిని మంత్రి పి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమైన బోధన్‌కు తరలించడం దాదాపుగా ఖరారైంది. రెండు రోజుల క్రితం ఇక్కడి నుంచి 23 మంది వైద్య ఉద్యోగులను బోధన్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేం ద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అనంతరం జిల్లా ఆస్పత్రిని తరలించడం అనివార్యమైంది.  ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ బోధన్‌లో స్థలపరిశీలన చేశారు. అయితే ఇటీవల వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాగార్జున బోధన్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లా ఆస్పత్రిని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు పడకల స్థాయి పెంపుపై సమీక్షించారు.

పెద్దాస్పత్రి ఏర్పాటుతో బోధన్ చుట్టు పక్కల కోటగిరి, వర్ని, రెంజల్, ఎడపల్లి, మండలాలకు మైద్య సేవలు మెరుగుపడతాయి. ఇది లా ఉండగా జిల్లా ఆస్పత్రిని బాన్సువాడకు తరలించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉండే బాన్సువాడ వెనుకబడిన ప్రాంతమైనందున వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. బాన్సువాడ మూడు నియోజక వర్గాలు, 16 మండలాలకు కేంద్ర బిందువుగా ఉంది. జుక్కల్, మద్నూరు, పిట్లం, బిచ్కుంద, బీర్కూర్, నిజాంసాగర్, వర్ని, ఎల్లారెడ్డి తది తర మండలాలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. అధికారులు కూడా బాన్సువాడకే  ఆస్పత్రిని తరలించాలని మొదట భావిం చినట్లు తెలుస్తోంది.
 
ఈ ఏడాది మే నెలలో బాన్సువాడ ఆస్పత్రిలో ఔట్‌పేషెంట్‌లు 18246 మంది, ఇన్ పేషెంట్‌లు 2744 మంది, బోధన్‌లో ఔట్ పేషెంట్‌లు 16,627 మంది , ఇన్‌పేషెంట్‌లు 948 మంది నమోదు అయ్యారు. జూన్‌లో బాన్సువాడలో ఔట్‌పేషెంట్‌లు 15686 మంది, ఇన్‌పేషెంట్‌లు 1749 మంది, బోధన్‌లో ఔట్‌పేషెంట్లు 16068 మంది, ఇన్‌పేషెంట్లు  972 మంది నమోదు అయ్యారు. జూలైలో బాన్సువాడలో ఔట్‌పేషెంట్‌లు 15553 మంది, ఇన్‌పేషెంట్‌లు 1591 మం ది, బోధన్‌లో ఔట్‌పేషెంట్‌లు 16647 మం ది, ఇన్‌పేషెంట్‌లు 970 మంది నమోదు అయ్యారు. ఈ వివరాల ప్రకారం రోగుల తాకిడి బాన్సువాడకే ఉన్నట్లు  వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
 
బాన్సువాడకే తరలించాలి.... జిల్లా ఆసుపత్రిని బాన్సువాడకే తరలించాలి. వెనుకబడిన ప్రాంతం కాట్టి మెరుగైన  వైద్యసేవలు అందే అవకాశం ఉంది. లేదంటే ఆందోళనలు చేసైనా సాధించుకుంటాం.
-శ్రీనివాస్‌గౌడ్, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్

ఉన్నతాధికారుల నిర్ణయమే.. జిల్లా ఆస్పత్రి తరలింపు రాష్ట్ర ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. తరలింపుపై పరిశీలన జరుగుతుంది. వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
 -బాలకృష్ణరావ్, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement