చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు

చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు - Sakshi


ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్సీ కరణం బలరాం బాహాబాహీకి దిగడంతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గొట్టిపాటి, కరణం పరస్పరం తన్నుకోవడంతో ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు అవాక్కయ్యారు.



కరణం వర్గీయులు గొట్టిపాటి చొక్కా పట్టుకుని లాగడంతో గొడవ ప్రారంభమైంది. తన చొక్కా చించడంతో గొట్టిపాటి ఎదురుతిరిగారు. దీంతో కరణం స్వయంగా రంగంలోకి దిగారు. పరస్పరం చొక్కాలు పట్టుకుని తలపడ్డారు. ఈ క్రమంలో గొట్టిపాటి రవికుమార్‌ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.



ఇరువర్గాల తోపులాటలు, అరుపులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. బల్లికురవ మండలం వేమవరంలో ఈ నెల 19వ తేదీ రాత్రి జరిగిన జంటహత్యలకు గొట్టిపాటి, కరణం వర్గాల ఆధిపత్యపోరు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గొట్టిపాటి, కరణం పరస్పరం బాహాబాహీకి దిగడం అధికార టీడీపీలో తీవ్ర కలకలం రేపింది.



గొట్టిపాటి వర్గీయులే తమను రెచ్చగొట్టారని కరణం బలరాం అన్నారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. గొట్టిపాటి తన పని తాను చూసుకోవాలని హితవు పలికారు.



మరోవైపు గొట్టిపాటి రవికుమార్‌ సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. కరణం వర్గీయుల దాడిపై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top