సొంతింటి కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి తీరా లాటరీ తీసే సమయంలో స్లిప్పులు చించేయడం ఆగ్రహం తెప్పించింది. చేతికి దొరికిన వస్తువులతో నాయకులు అని కూడా చూడకుండా దాడికి దిగారు.

రాజమండ్రి, న్యూస్‌లైన్: సొంతింటి కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి తీరా లాటరీ తీసే సమయంలో స్లిప్పులు చించేయడం ఆగ్రహం తెప్పించింది. చేతికి దొరికిన వస్తువులతో నాయకులు అని కూడా చూడకుండా దాడికి దిగారు. రాజమండ్రిలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన పథకం(వాంబే)లో భాగంగా రాజమండ్రిలోని రామకృష్ణ థియేటర్ వెనుక ఆవ (రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి)లో 2,256 ఫ్లాట్లను నిర్మించారు. వీటిని లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించేందుకు గృహనిర్మాణశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నగర టీడీపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, మరికొద్దిమంది నేతలు అక్కడకు చేరుకున్నారు. ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తుండగా టీడీపీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌ను ఎందుకు ఆహ్వానించలేదని, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గోరంట్ల అధికార పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును నిలదీశారు. దీంతో వారిద్దరూ పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఈ క్రమంలో గోరంట్ల అనుచరులు డ్రా తీయాల్సిన స్లిప్పులను చించివేశారు. దీంతో ఆగ్రహోదగ్రులైన లబ్ధిదారులు ఒక్కసారిగా టీడీపీ నాయకులపైనా, వారి అనుచరులపైనా విరుచుకుపడ్డారు. వారిపై రాళ్లు విసిరారు. మహిళలు చెప్పులు చూపిస్తూ తిట్ల దండకం అందుకున్నారు. చివరకు గోరంట్ల కారెక్కి పలాయనం చిత్తగించారు. కాగా, పెనుగులాటలో విజయలక్ష్మి అనే మహిళ గాయపడింది.
అభివృద్ధి చూసి ఓర్వలేకే: రౌతు
తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే గోరంట్ల అడ్డుతగులుతున్నారని ఎమ్మెల్యే రౌతు ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 12న తిరిగి డ్రా తీసి ఇళ్లు కేటాయిస్తామన్నారు. మహిళలపై దౌర్జన్యానికి పాల్పడిన గోరంట్లను, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు తాడితోట సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. గోరంట్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా ఎమ్మెల్యే రౌతు ప్రోద్బలంతో ఆయన అనుచరుడు మజ్జి అప్పారావు, మహిళలు దాడి చేశారంటూ టీడీపీ నాయకులు బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


