ఇంటికే ఇసుక విజయవంతం 

Good response to Sand door delivery in four districts - Sakshi

నాలుగు జిల్లాల్లో డోర్‌ డెలివరీకి మంచి స్పందన 

రాష్ట్రమంతా అమలుకు వేగంగా కసరత్తు

దళారీ వ్యవస్థ నిర్మూలన

మాఫియా మాటే లేదు 

అంతా ఆన్‌లైన్‌లోనే..

జీపీఎస్‌తో వాహనాల కదలికల పర్యవేక్షణ

నిఘానేత్రంతో అక్రమ రవాణాకు చెక్‌ 

ఇప్పటివరకు 60.44 లక్షల టన్నులు సరఫరా  

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌లో ఎక్కడ నుంచి బుక్‌ చేసుకున్నా  ఇంటివద్దకే ఇసుక అందించే సరికొత్త విధానం నాలుగు జిల్లాల్లో విజయవంతం కావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం 9 జిల్లాల్లో ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసుకుని స్టాక్‌ యార్డుల నుంచి పొందే సదుపాయం ఉంది. నాలుగు జిల్లాల్లో మాత్రం వినియోగదారులు కోరిన చోటకే ఇసుకను అందచేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. మాఫియా, దళారీ వ్యవస్థలను నిర్మూలించడంతోపాటు అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సరసమైన ధరలకు ఇసుకను అందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది.  
రాష్ట్రమంతా డోర్‌ డెలివరీకి కసరత్తు 
గత ఏడాది సెప్టెంబరు 5వతేదీన కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) 60.44 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేసింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఇసుకను అందించే విధానం తొలుత అమల్లోకి తెచ్చింది. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఇసుక డోర్‌ డెలివరీ విధానాన్ని అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించిన నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, వైఎస్సార్‌ జిల్లాల్లో  ప్రవేశపెట్టింది. కిలోమీటర్ల వారీగా టన్ను / ట్రాక్టరుకు ఇసుక రవాణా చార్జీలను అధికారులు ఖరారు చేశారు. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించిన వారికి ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో ఇంటికే ఇసుక అందచేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 1.12 లక్షల మందికి డోర్‌ డెలివరీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఇసుకను ఇక్కడి అవసరాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్‌ పోస్టులను పెంచడంతోపాటు మూడు వేల మందికిపైగా కొత్త సిబ్బందిని  నియమిస్తోంది. 24 గంటలూ పనిచేసేలా శక్తివంతమైన సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది.   

విజయవాడ నుంచే వాహనాల కదలికలపై నిఘా 
జీపీఎస్‌ పరికరాలు కలిగి ఉండి, భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలనే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలు ఎక్కడ నుంచి బయలుదేరాయి? ఎక్కడకు వెళుతున్నాయి? దారి మళ్లుతున్నాయా? అనే విషయాలను విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top