బోధనాసుపత్రులకు మంచిరోజులు | Good Days For Teaching Hospitals | Sakshi
Sakshi News home page

బోధనాసుపత్రులకు మంచిరోజులు

Jun 10 2019 3:52 AM | Updated on Jun 10 2019 3:52 AM

Good Days For Teaching Hospitals - Sakshi

సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా టీడీపీ హయాంలో నియామకమంటే ఏమిటో తెలీక కునారిల్లిన రాష్ట్రంలోని బోధనాస్పత్రులకు మంచిరోజులు వస్తున్నాయి. త్వరలోనే వీటిల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినట్లుసమాచారం. ఇటీవల సీఎం.. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఈ శాఖకు సంబంధించిన తాజా స్థితిగతులపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. బోధనాస్పత్రుల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చామని.. ఈ పోస్టుల భర్తీకి ఆయన సుముఖత వ్యక్తంచేసినట్లు వైద్య విద్యాశాఖాధికారులు చెప్పారు. ఇందులో భాగంగా తక్షణమే 2,550మంది నర్సుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని ఓ అధికారి చెప్పారు. ఈ నిర్ణయంతో బోధనాస్పత్రులను పీడిస్తున్న నర్సుల కొరత తీరుతుందని ఆయనన్నారు.

ఒక్కో ఆస్పత్రికి 231 మంది నర్సింగ్‌ సిబ్బంది
రాష్ట్రంలో ప్రతి బోధనాసుపత్రిలో నర్సింగ్‌ కొరత కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల మేరకు ఉండాల్సిన నర్సుల కంటే చాలా తక్కువగా ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఐసీయూ వార్డుల్లో రోగులకు సేవలందించడం చాలా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో 2,550 మంది నర్సుల నియామకం కీలకంగా మారనుంది. ఏపీలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా 11 బోధనాసుపత్రులున్నాయి. వీటిలో నియామకాలు పూర్తయితే ఒక్కో ఆస్పత్రికి సగటున 231 మంది కొత్తగా నర్సులు వస్తారు. తద్వారా పలు కీలక వార్డుల్లో రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పటికే వీటి నియామక ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వీలైనంత త్వరలోనే స్టాఫ్‌ నర్సుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలను పంపనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, నర్సులు, ఇతర మౌలిక వసతులు పెరిగితే వచ్చే ఏడాది ఎంబీబీఎస్‌ సీట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా వైద్య వర్గాలు చెప్పాయి.

సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులకు మోక్షం
ఇదిలా ఉంటే.. 2014లో కేంద్ర ప్రభుత్వం అనంతపురం, విజయవాడలోని బోధనాసుపత్రుల్లో పీఎంఎస్‌ఎస్‌వై కింద సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులు ఒక్కో దానికి రూ.120 కోట్లు కేటాయించింది. దీంతో భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. రాష్ట్ర వాటా కింద ఒక్కో ఆస్పత్రికి రూ.30 కోట్లు ఇవ్వాలి. అంటే మొత్తం రూ.60 కోట్లు ఇవ్వాలి. ఈ వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాకుల ప్రారంభోత్సవాలు నిలిచిపోయాయి. ఈ సొమ్ముతో వైద్యపరికరాలు కొనాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అవి ఆగిపోయాయి. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే రూ.60 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, దీనివల్ల ఈ రెండుచోట్లా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement