‘వెలిగొండ’ టెండర్లలో మళ్లీ కుమ్మక్కు

Golmal In Veligonda Project Tenders - Sakshi

సీఎం రమేష్‌ సంస్థకే పనులు దక్కేలా చక్రం తిప్పిన ముఖ్యనేత

టెక్నికల్‌ బిడ్‌ తెరవడంతో బహిర్గతమైన లాలూచీ బాగోతం 

ముఖ్యనేతకు రూ.300 కోట్లకుపైగా కమీషన్లు

సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) టెండర్లలో లాలూచీ పర్వం మరోసారి బట్టబయలైంది. రెండో టన్నెల్‌ పనుల్లో రూ.300 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేసేందుకు ముఖ్యనేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్, నవయుగ, పటేల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలతో అదనపు(ఎక్సెస్‌) ధరలకు బిడ్‌లు దాఖలు చేయించారు. శనివారం ఫైనాన్స్‌(ఆర్థిక) బిడ్‌ను తెరిచి, సీఎం రమేష్‌ సంస్థకు ఈ పనులు అప్పగించనున్నట్లు సమాచారం. వెలిగొండ ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

టన్నెళ్ల పనులను వేగవంతం చేయాలన్న సాకు చూపి నిబంధనలు తుంగలో తొక్కి 2016 జూలై 5న కాంట్రాక్టర్లకు రూ.68.44 కోట్లు ఇచ్చేసింది. అయినా పనుల్లో వేగం పెరగడం లేదంటూ 60సీ నిబంధన కింద రెండు టన్నెళ్ల కాంట్రాక్టర్లపై వేటువేసింది. మొదటి టన్నెల్‌లో మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల పనుల విలువను రూ.116.44 కోట్లుగా.. రెండో టన్నెల్‌లో మిగిలిపోయిన 8.037 కిలోమీటర్ల పనుల విలువను రూ.299.48 కోట్లుగా స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్సీ) లెక్కగట్టింది. అయితే, ముఖ్యనేత ఒత్తిడి మేరకు మొదటి టన్నెల్‌లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.292.15 కోట్లు, రెండో టన్నెల్‌లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.720.26 కోట్లకు పెంచేసింది. 

నోటిఫికేషన్‌కు ముందే బేరసారాలు 
మొదటి టన్నెల్‌ పనులకు రూ.234.04 కోట్ల అంచనా వ్యయంతో, రెండో టన్నెల్‌ పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చి 26న టెండర్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు. పెంచిన అంచనా వ్యయం రూ.596 కోట్లలో.. సింహభాగాన్ని కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి పథకం రచించారు. గత నెల 20న ఫైనాన్స్‌ బిడ్‌ తెరిచారు. తొలి టన్నెల్‌ పనులకు ఇద్దరు కాంట్రాక్టర్లు, రెండో టన్నెల్‌ పనులకు ఒకే కాంట్రాక్టర్‌ బిడ్‌లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం సింగిల్‌ బిడ్‌ టెండర్లను ఆమోదించకూడదు. అయినా ఆమోదించాలంటూ ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో  రెండో టన్నెల్‌ టెండర్లను రద్దు చేశారు.

రెండోసారీ అదే తీరు 
రెండో టన్నెల్‌కు 570.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)– ఓపెన్‌ విధానంలో ఈ నెల 8న మళ్లీ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మూడు సంస్థలతో అదనపు ధరలకు టెండర్లు దాఖలు చేయించేలా ముఖ్యనేత వ్యూహం రచించారు. అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన సంస్థకు పనులు దక్కేలా మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో బిడ్‌లు దాఖలు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం తెరిచిన టెక్నికల్‌ బిడ్‌లో కుమ్మక్కు పర్వం బహిర్గతమైంది. శనివారం ఫైనాన్స్‌ బిడ్‌ తెరిచి, సీఎం రమేష్‌ సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 300 కోట్ల రూపాయలకుపైగా ముడుపులు చేతులు మారనున్నట్లు అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top