బంగారంలాంటి అవకాశం

Gold Prices Down in West Godavari - Sakshi

దిగొచ్చిన పసిడి ధర కాసుకు రూ.1500 వరకూ తగ్గుదల

24 క్యారెట్లు 10 గ్రాములు రూ.32,600

22 క్యారెట్లు 10 గ్రాములు రూ.30,500

కాసుకు రూ.1,500 వరకు తగ్గుదల

జిల్లాలో పెరుగుతున్న అమ్మకాలు

పశ్చిమగోదావరి, నరసాపురం: మొన్నటి వరకూ మిడిసిపడిన పసిడి ధర నేలవైపు చూస్తుంది. ఊహించని స్థాయిలో బంగారం ధరలు దిగి వచ్చాయి. నరసాపురం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.32,600, 22 క్యారెట్ల 916 ఆభరణాల బంగారం రూ.30,500గా ట్రేడవుతోంది. అంటే 916 ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.24,400గా పలుకుతోంది. గత 15 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో కాసు బంగారం ధర రూ.1,500 వరకూ తగ్గింది. ధరలు ఇంకా దిగివస్తాయని అంచనాలు కడుతున్నారు. ఇప్పటికే దాదాపు రెండేళ్ల కనిష్టానికి ధరలు చేరాయి. ఇంకా తగ్గితే మొన్నటి వరకూ ధరల పెరుగుదలలో ఆల్‌టైమ్‌ హైలతో రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు ధరల తగ్గుదలలోనూ అదే రికార్డుస్థాయి ఒరవడిని కొనసాగిస్తుంది. అయితే అంతర్జాతీయంగా ఆ పరిస్థితి లేదని, ధరలు తగ్గుదల తాత్కాలికమేనని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతగా క్షీణించడం ఇదే ప్రథమం. ఇదే ఏడాది జనవరిలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.34 వేల మార్కును రెండోసారి దాటి రికార్డును సృష్టించింది. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.35 వేల మార్కును చేరుకుంటుందని అంచనా కట్టారు. అయితే మళ్లీ బంగారం ధరలు కాస్త తగ్గుతూ వచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం దారిలోనే కొనసాగుతున్నాయి. కిలోవెండి ధర రూ.38,600గా ట్రేడవుతుంది. వెండి ధర కూడా రూ.2 వేలు కూడా తగ్గింది.

ఒడిదుడుకుల్లో షేర్‌ మార్కెట్లు
మరోవైపు షేర్‌ మార్కెట్‌లు కూడా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతున్నాయి. నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ముదుపర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావించి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందుకే షేర్‌మార్కెట్‌ల పతనం సమయంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. షేర్‌ మార్కెట్‌లు పతనాల్లో ఉన్నా కూడా  ప్రస్తుతం బంగారం ధరల్లో ధరలు తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ తగ్గడం, దేశీయంగా ఎన్నికల నేపథ్యంలో బంగారం దిగుమతులపై ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోవడం ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. చైనా భారీగా అమ్మకాలకు పూనుకోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అమెరికాలో కూడా బంగారం నిల్వలను అమ్మకాలకు పెడితే మాత్రం ధరలు మరింత అనూహ్యంగా పడిపోతాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా కడుతున్నారు. అయితే బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల విషయంలో ఏమీ చెప్పలేమని కొనుగోళ్లు, అమ్మకాలు విషయంలో వినియోగదారులు విజ్ఞత మేరకు ఆలోచించాలని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు  చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంచి ధరల్లో బంగారం ఉందని, ఇప్పుడే బంగారం కొనడానికి ఇదే గోల్డెన్‌ చాన్స్‌ అని అంటున్నారు. దీంతో కొనుగోలు దారులు ఏకీభవిస్తున్నారు కూడా. దీంతో బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు దాదాపు 40 శాతం పెరిగాయని అంచనా.

జిల్లాలో పెరిగిన అమ్మకాలు
జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం లాంటి ప్రధాన పట్టణాల్లో గడిచిన వారం రోజులుగా రోజుకు రూ.3 కోట్లు పైనే అమ్మకాలు పెరిగినట్టు అంచనా. మొత్తం ఆభరణాల అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. ధరలు తగ్గడం, ఎన్నికల తరువాత జనం చేతుల్లో కాస్త డబ్బు మసలడం లాంటి కారణాలతో అమ్మకాలు పెరిగినట్టుగా చెబుతున్నారు. మరోవైపు పెట్టుబడులపై మగ్గు చూపకపోవడంతో బిస్కట్‌ అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదే మంచి తరుణం
బంగారం ధరలు చాలా బాగా తగ్గాయి. బంగారం కొనడానికి ఇదే మంచి సమయం. ఇంత బాగా ధరలు తగ్గుతాయని మేం ఊహించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులరీత్యా ధరలు కాస్త తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చు. తగ్గుదల మాత్రం తాత్కాలికమే. ప్రస్తుతం అమ్మకాలు మాత్రం మంచి ఊపుమీద సాగుతున్నాయి.– వినోద్‌కుమార్‌ జైన్, బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నరసాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top