వైభవంగా అప్పన్న చందనోత్సవం

As the glory of appanna candanotsavam - Sakshi

స్వామి నిజరూప దర్శనంతో పులకింత 

సింహాచలం: వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకొని పరవశించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం తెల్లవారుజాము ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరాధన నిర్వహించి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు తొలిదర్శనం కల్పించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామికి పట్టువస్త్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి తరలివచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లురవీంద్ర, చినరాజప్ప, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీతారామ్మూర్తి, జస్టిస్‌ శివశంకర్‌రావు, జె.ఉమాదేవి, ఎ.రామలింగేశ్వరరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, విశ్వంజీమహరాజ్‌ స్వామి దర్శించుకున్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top