‘వర్ల’ ఆగడాలు అరికట్టండి | given complaint against on varla ramaiah | Sakshi
Sakshi News home page

‘వర్ల’ ఆగడాలు అరికట్టండి

Jul 16 2014 2:54 AM | Updated on Aug 10 2018 8:08 PM

‘వర్ల’ ఆగడాలు అరికట్టండి - Sakshi

‘వర్ల’ ఆగడాలు అరికట్టండి

టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని, అరికట్టాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం రాత్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

మచిలీపట్నం : టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని, అరికట్టాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మంగళవారం రాత్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన వర్ల రామయ్య.. ఆయనకు ఓటు వేయలేదని ప్రజలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో పాల్గొని పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె వివరించారు. పోలీసులు సైతం ఆయనకు వత్తాసు పలుకుతున్నారని వివరించారు.
 
ఎమ్మెల్యేనంటూ బెదిరింపులు..
ఎన్నికల్లో ఓటమిపాలైన వర్ల రామయ్య తానే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనని, టీడీపీ అధికారంలో ఉందని, అధికారులు తన మాట వినకుంటే మంత్రులతో చెప్పి బదిలీ చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నారని కల్పన తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీడీపీకి విరాళాలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారని, దీంతో భయపడిన అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసిన వారి జాబితాను రూపొందించుకుని, వారు నియోజకవర్గంలో ఉండకూడదని బాహాటంగానే హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.
 
ఇసుక క్వారీలు తెరిపించండి
పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో ఉన్న తొమ్మిది ఇసుక క్వారీలను తెరిపించాలని కలెక్టర్‌కు ఉప్పులేటి కల్పన  వినతిపత్రం అందజేశారు. ఇసుక క్వారీలను తెరిస్తే నియోజకవర్గానికి ఆదాయం వస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక క్వారీలకు వేలంపాట నిర్వహించేందుకు నూతన పాలసీని తయారు చేస్తోందని చెప్పారు.

ఈ నిబంధనల ప్రకారం ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. వర్ల రామయ్య విషయంపై మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలోని అందరు అధికారులకు ఈ అంశంపై తగు సూచనలు, సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మొవ్వ, పెదపారుపూడి జెడ్పీటీసీ సభ్యులు చిమటా విజయశాంతి, మూల్పూరి హరీష, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లెం వెంకటేశ్వరరెడ్డి, పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement