రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ...ఇక ఈసీల జారీ | Ghars ... It is issued by the Registrar EC | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ...ఇక ఈసీల జారీ

Dec 13 2013 1:02 AM | Updated on Sep 2 2017 1:32 AM

ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)ల జారీలో కాస్త వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఈసీలు తదితర సేవల విషయంలో...

 =పభుత్వం ఆదేశం
 =ఊపిరిపీల్చుకున్న జనం

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)ల జారీలో కాస్త వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఈసీలు తదితర సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సడలింపు ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతకుముందు లాగానే ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వీటిని జారీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఉత్తర్వులు అందాయి. దీంతో రిజిస్ట్రేషన్స్ శాఖలో పెద్ద సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రజలు గతంలో మాదిరిగా వివిధ రకాల సేవలు పొందవచ్చని అందిన ఆదేశాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
ఏడాదిగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట...

గత ఏడాది కాలంగా మీ సేవా కేంద్రాలలో ఈసీలు, దస్తావేజుల నకళ్లు జారీ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాటిని జారీ చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాంతో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈసీలు, దస్తావేజు నకళ్ల జారీ నత్తనడకన సాగుతోంది. ఈసీల కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈసీ కోసం దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నా ఆన్‌లైన్‌లో అవి పరిష్కారం కావటం లేదు.

ఆన్‌లైన్‌లో అనేక సమస్యల వల్ల ఈసీ పొందటం గగనమవుతోంది. గతంలో ఈసీ పొందటానికి వంద రూపాయలలోపు ఖర్చు చేసేవారు. మీ సేవల్లో ఈసీ పొందటానికి కనీసం రూ.300 ఖర్చు అవుతోందని చెపుతున్నారు. దీంతోపాటు గంటల వ్యవధిలో పూర్తయ్యే ఈసీల జారీ ప్రక్రియ వారం.. పది రోజులు కూడా పడుతోంది. దస్తావేజుల నకళ్లు, దాఖలైన అర్జీలు మీ సేవల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉంటున్నాయి.

వీటిన్నింటిపై ప్రజల నుంచి, రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అందిన విజ్ఞప్తులపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి తోట నరసింహం ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈసీలు, ఇతర సేవలు పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కొద్దిరోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నారు. అనంతరం ఈసీలు, దస్తావేజు నకళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జారీ చేస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement