కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలంటూ కేంద్రం చేసిన వినతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ధర్మాసనం నుంచి విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేసింది.
విచారణ ముగింపు దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి ఇలాంటిది ఊహించలేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది.
విచారణ చివరి రోజున కేంద్రం ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడుతుందని తాము ఊహించలేదని పేర్కొంది. కేంద్రం ప్రస్తుత ధర్మాసనాన్ని తప్పించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని సీజేఐ వ్యాఖ్యానించారు. సీజేఐ గవాయ్ ఈ నెల 23 వ తేదీన పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్ వంటి ట్రిబ్యునళ్ల రద్దు, వివిధ ట్రిబ్యునళ్లకు నియామకాలు, సభ్యుల పదవీ కాలానికి సంబంధించిన సవరణలు 2021 చట్టంలో ఉన్నాయి.


