జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత

Published Thu, Feb 25 2016 1:51 AM

జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత

గుంటూరు మెడికల్ :  ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఎలుకల వేట కొనసాగుతోంది. బుధవారం నాటికి 1,251 ఎలుకలను పట్టుకున్నారు. గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటనతో అధికారులు ఎలుకల నిర్మూలన కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. జిల్లాలోని వట్టిచెరుకూరుకు చెందిన సీహెచ్ హనుమంతురావు, నాగలక్ష్మి దంపతులు ప్రతి రోజూ వార్డుల్లో ఎలుకలను పట్టే బోన్లు అమర్చుతున్నారు. బోనులో ఉన్న ఆహారం కోసం వచ్చిన ఎలుకలు వాటిలో ఇరుక్కొని చనిపోతున్నాయి. చనిపోయిన వాటిని వెంటనే అధికారులకు లెక్క చూపించి మళ్లీ నూతనంగా బోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎలుకను పట్టినందుకు రూ.20  చొప్పున అందిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.6 వేలు వేతనం ఇప్పిస్తున్నారు. ఎలుకలు పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు ఎలుకల వేట ఆస్పత్రిలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement