పల్లె.. తల్లడిల్లె..!

 Garbage Work Stopped To Mandapeta Mandal - Sakshi

ప్రజాపాలన వ్యవస్థను గాడి తప్పించిన  చంద్రబాబు సర్కారు 

జన్మభూమి కమిటీలకు పెత్తనం, ఖాళీ పోస్టులతోనే పాలన 

అధికారులు అందుబాటులో లేక  ప్రజల ఇక్కట్లు 

కుంటుపడిన గ్రామాభ్యుదయం, అవస్థలు పడుతున్న ప్రజలు 

సాక్షి, మండపేట: పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించింది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది. ప్రజలతో ఎన్నికైన పాలకవర్గాన్ని కాదని, తెలుగు తమ్ముళ్లతో ఏర్పాటు చేసిన కమిటీలకు పెత్తనం అప్పగించింది. మరోపక్క పంచాయతీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రజలను ఇబ్బందులు పాల్జేసింది. నిధులున్నా తరచూ ట్రెజరీ ఆంక్షలతో వినియోగించుకోలేని దుస్థితిలోకి పంచాయతీలను నెట్టేసింది. అభివృద్ధి పనులు ముందుకు సాగక, ఉద్యోగులకు జీతాలు చెల్లించక గ్రామ పాలన పడకేసింది.

జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో మొత్తం 779 క్లస్టర పరిధిలో 1,069 పంచాయతీలకు గాను గ్రేడ్‌ –1 పరిధిలో 300 పంచాయతీలు ఉండగా, గ్రేడ్‌–2 పంచాయతీలు 231, గ్రేడ్‌ –3 పంచాయతీలు 308, గ్రేడ్‌–4 పంచాయతీలు 230 ఉన్నాయి. రిజిస్ట్రార్‌ విలువ ఆధారంగా పన్నుల భారాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు ఆ స్థాయిలో సదుపాయాల కల్పనను విస్మరించింది.

జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టు ఖాళీ అయ్యి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇన్‌చార్జి పాలనలో ఉండడం గమనార్హం. కాకినాడ డీఎల్‌పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పాలనలో ప్రధాన భూమిక నిర్వర్తించే కార్యదర్శులకు కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ధృవపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ సేవలు, స్మార్ట్‌ గ్రామాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, ఇతర పాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు.

779 క్లస్టర్లకుగాను 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు ఉండడంతో 230 క్లస్టర్ల పరిధిలోని పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అధికశాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. 

ఏలికలు లేకుండానే పల్లెపాలన
పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారు. నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాలు నేపథ్యంలో 2013లో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 27 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్‌లోని కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్‌లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు.

రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. 2014 ఆగస్టు నాలుగో తేదీతో అనపర్తి పంచాయతీ పదవీకాలం ముగియగా, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక పాలనలో ఉంది. 

పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 పంచాయతీల్లో సర్పంచ్‌ పదువులకు ఎన్నికలు జరపాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. సకాలంలో వీటికి ఎన్నికలు జరపకపోవడంతో ప్రత్యేక పాలనలోనే మగ్గాయి.

ఎన్నో ఇబ్బందుల్లో ప్రజలు
పాలకులు లేకపోవడంతో వెలగని వీధిలైట్లు, డ్రైన్‌లో పారని మురుగునీరు, పనిచేయని కుళాయిలు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారిశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగుపడని అభివృద్ధి, పాలకవర్గాలు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఎనిమిదేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. పట్టించుకునే వారు లేక గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. .

పాలకులపై పెత్తనం 
పంచాయతీల్లో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం పాలన సాగిస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనుల నిర్వహణలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. రాజ్యాంగ బద్ధంగా సాగే ఈ ప్రక్రియను తుంగలోకి తొక్కి జన్మభూమి కమిటీల పేరిట అధికారపార్టీ నేతలకు పెత్తనం అప్పగించారు సీఎం చంద్రబాబు. అర్హులందరికీ అందాల్సిన సంక్షేమ ఫలాలను జన్మభూమి కమిటీల ద్వారా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకున్నారు.

పింఛన్లు, రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, కార్పొరేషన్‌ రుణాలు తదితర ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. పథకాల మంజూరులో తెలుగు తమ్ముళ్ల చేతివాటం దాఖలాలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.  

సిబ్బందికి జీతాలు అందక..
ట్రెజరీ నిధులపై ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో పంచాయతీ సిబ్బంది జీతాలు అందకపోవడంతో పాటు, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. జిల్లాలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో 5,600 మంది, రెగ్యులర్‌గా 318 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ ట్రెజరీ ఆంక్షలతో సకాలంలో జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు ఆంక్షలు ఆటంకంగా మారాయి. కోట్లాది రూపాయల మేర బిల్లు బకాయిలు పేరుకుపోతుండడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. బిల్లులు విడుదల కాక ఏం చేయాలో పాలుపోనిస్థితిలో కాంట్రాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు. 

పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం 
జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికన అధికారపార్టీ నేతలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం కేవలం ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. 
-చింతా ఈశ్వరరావు, మండల సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పెదకొత్తూరు, కరప మండలం

అధికారులు లేక ఇక్కట్లు
పంచాయతీల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు పంచాయతీల వరకు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కార్యదర్శుల కొరతతో ఏ పనీ సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
 -కసిరెడ్డి ఆంజనేయులు, మాజీ సర్పంచ్, లూతుకుర్రు, మామిడికుదురు మండలం

 జీతాలు చెల్లించలేని దుస్థితి 
ట్రెజరీ ఆంక్షలతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితికి పంచాయతీలను ప్రభుత్వం తీసుకువచ్చింది. సకాలంలో బిల్లులు విడుదలవ్వక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సమస్యలు పరిష్కారమవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. 
-పండా రామకృష్ణదొర, పందిరిమామిడి, ఏజెన్సీ డివిజన్‌ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top