హైవేల విస్తరణకు నిధులు

Funding for Highways Expansion - Sakshi

నాతవలస–రాయ్‌పూర్‌ రోడ్డుకు రూ.125 కోట్లు  

రూ.48 కోట్లతో సాలూరు బైపాస్‌ రోడ్డు నిర్మాణం 

దేవరపల్లి–జీలుగుమిల్లి రహదారి విస్తరణకు రూ.80 కోట్లు 

వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డుకు రూ.34 కోట్లు  

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల విస్తరణకు వార్షిక ప్రణాళికలో భాగంగా రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నేషనల్‌ హైవే–25లో భాగమైన నాతవలస–విజయనగరం–రాయ్‌పూర్‌ రోడ్డును 42 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందుకు రూ.125 కోట్లు వెచ్చించనుంది. విజయనగరం జిల్లా సాలూరు బైపాస్‌ రోడ్డు (5.8 కి.మీ.) నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డును 20 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. జీలుగుమిల్లి–కొవ్వూరు మధ్య 26 కిలోమీటర్లను రూ.15 కోట్లతో విస్తరించనున్నారు.

రాజమండ్రి–మధురపూడి (విమానాశ్రయం) ఎన్‌హెచ్‌–516 రోడ్డును రూ.35 కోట్లతో 34 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా మానాపురం రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ) అప్రోచ్‌ రోడ్డుకు రూ.42 కోట్లు వెచ్చి స్తారు. ప్రకాశం జిల్లా వాడరేవు–నారాయణపురం–పిడుగురాళ్ల రోడ్డును 43 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనికి రూ.34 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా పామర్రు–దిగమర్రు రహదారి (ఎన్‌హెచ్‌–165)ని రూ.12 కోట్లతో 17 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు.

గుంటూరు–అమరావతి రోడ్డును 9 కిలోమీటర్లమేర రూ.18 కోట్లతో బలోపేతం చేస్తారు. వార్షిక ప్రణాళికలో రూపొందించిన వీటికి పరిపాలనా ఆమోదం కోసం పంపించామని జాతీయ రహదారుల విభాగం సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాఘవేంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులకు ప్యాచ్‌ వర్కులు చేస్తున్నామని తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top