జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. జన జీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా బంద్‌కు ఏపీఎన్‌జీవోల పిలుపు మేరకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో బంద్ సంపూర్ణమైంది. జన జీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా బంద్‌కు ఏపీఎన్‌జీవోల పిలుపు మేరకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. సమైక్యాంధ్ర నినాదాలతో జిల్లా మార్మోగిపోయింది. ప్రతి ప్రాంతంలోను స్థానికులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. జిల్లా అంతటా తిరుగుతూ సందడి చేశారు. నక్కపల్లి, యలమంచిలి,చోడవరం, పాడేరు, అనకాపల్లి, అరకులోయ,తదితర ప్రాంతాల్లో వివిధ సంఘాల వారు మానవహారాలు నిర్వహించారు. రాస్తారోకోలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.
వ్యాపారసంస్థలు మూత: సమైక్యాంధ్ర బంద్ నేపథ్యంలో చిన్న వ్యాపారులు నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు అన్నింటినీ స్వచ్ఛందంగా మూసివేశారు. సినిమా థియేటర్ల యజమానులు తొలి రెండు ప్రదర్శనలు నిలిపివేశారు. పార్లర్లు నుంచి హోటళ్లు వరకు అన్ని బంద్ పాటించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగలేదు. వ్యాపారాలకు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఆటో కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించి విశాఖ నగరమంతా ర్యాలీలు చేశారు.
కేంద్ర సంస్థలను మూయించిన ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు, ఇతర వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించినా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం యాథావిధిగా ఉదయం తెరిచారు. విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాలు బృందాలుగా విడిపోయి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఆదాయపన్ను శాఖ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ఎంఎంటీసీ, ఎన్‌ఎంటీసీ, బీఎస్‌ఎన్‌ఎల్, వన్‌టౌన్‌లోని ఫిషరీస్, ఎల్‌ఐసీ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించారు. తెరిచి ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలను కూడా బలవంతంగా మూయించారు.
బ్యాంకులు మూసివేత
బంద్‌కు పిలుపునిచ్చినా బ్యాంకులు తెరుచుకోవడంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెళ్లి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆయా బాంకుశాఖల్లోకి వెళ్లి ఉద్యోగులను బయటకు పంపించేశారు. బలవంతంగా బ్యాంకులకు తాళాలు వేయించారు. విశాఖ సిరిపురంలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయాన్ని కూడా మూసివేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగులు కొంత సేపు హడావుడి చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెనక్కి తగ్గకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో సుమారుగా రూ.300 కోట్లు లావాదేవీలు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.
నేడు, రేపు ప్రయివేట్ వాహనాల బంద్
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలు బంద్ పాటించనున్నాయి. రెండు రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు రవాణా సదుపాయం ఉండదు. ఇప్పటికే ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రయివేట్ వాహనాల సర్వీసులను కూడా స్తంభింపజేయాలని ఉద్యోగ సంఘాలు ఆయా యాజమాన్యాలపై కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. తాజాగా ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం ప్రయివేట్ వాహన యజమానులతో చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సహకరించాలని కోరారు. దీనికి వారు కూడా అంగీకరించారు. దీంతో రెండు రోజుల పాటు బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించారు.