
సాక్షి, విజయనగరం : పెళ్లైన కొన్ని రోజులకే ఫేస్‌బుక్ లవర్‌తో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించి, రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్వతీపురం సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం పోలీసులు వెల్లడించారు. ఆదివారం విజయనగరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తనకు కాబోయే భర్త తన మేనబావ అయిన గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి సరస్వతి బెంగుళూరు ముఠాతో ఒప్పందం చేసుకుందని తెలిపారు.
పెళ్లికి ముందే ఫేస్‌బుక్ లవర్ శివతో కలిసి బెంగుళూరుకు చెందిన ఓ ముఠాకు 25 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని వెల్లడించారు. ఆ నగదును శివ ఆన్‌లైన్ నగదు చెల్లింపు యాప్ ద్వారా పంపినట్టు తెలిపారు. అయితే అడ్వాన్సు తీసుకున్న ముఠా ఫోన్ ఎత్తకపోవడంతో, విజయనగరానికి చెందిన మరో ముఠాతో ఒప్పందం చేసుకుని శివతో కలిసి సరస్వతి ఆమె భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించి, దుండగుల దాడిలో మరణించాడని నాటకమాడిన విషయం తెలిసిందే.