విదేశీయునికి కరోనా పాజిటివ్‌ 

Frenchman Got Corona Positive In Anantapur - Sakshi

బెంగళూరులో చికిత్స పొందుతున్న విదేశీయుడు  

పుట్టపర్తిలో ర్యాపిడ్‌ యాక్షన్‌  బృందం జల్లెడ  

సాక్షి, అనంతపురం: బెంగళూరులో ఫ్రాన్స్‌కు చెందిన వృద్ధుడికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. కోవిడ్‌ స్టేట్‌ నోడల్‌ అధికారులు సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడ బస చేశాడు? ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు తదితర వివరాలు సేకరించాలని జిల్లా ఆరోగశాఖాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందం డాక్టర్‌ వాలీ్మకి శ్రీనివాస్, డాక్టర్‌ భీమసేనాచార్, డాక్టర్‌ రాంకిషోర్‌ (అసోసియేట్‌ ప్రొఫెసర్లు, బోధనాస్పత్రి), డీఎంఓ దోశారెడ్డి, పోలీసులు పుట్టపర్తిలో జల్లెడ పట్టారు.

ఫ్రాన్స్‌ దేశస్తుడు కొమరైన్‌ అలైన్‌జెన్‌ (64) పుట్టపర్తిలోని సాయికుమార్‌ సాయికుమార్‌ లాడ్జ్‌లో బస చేశారని చెప్పడంతో బృందం అక్కడకు వెళ్లి ఆరా తీసింది. అధికారుల ఆదేశాల మేరకు విదేశీయులను  లాడ్జి నుంచి ఖాళీ చేయించారు. దీంతో కొమరైన్‌ ఈ నెల 15న లాడ్జి ఖాళీ చేశాడు. 17వ తేదీ బెంగుళూరుకు వెళ్లిపోయాడు. శుక్రవారం బెంగుళూరులోని ఆస్పత్రిలోపరీక్షలు చేయగా కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో అధికారులు గురువారం రాత్రి సాయికుమార్‌ లాడ్జిని సీజ్‌ చేశారు. సదరు విదేశీయుడు పుట్టపర్తిలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు అని ఎస్పీ సత్యయేసుబాబు సైతం ఆరా తీశారు. 

ఐదుగురి నమూనాల సేకరణకు ఆదేశం 
పుట్టపర్తి చెందిన లాడ్జ్‌ యజమాని దంపతులు, ఓ వృద్ధురాలు, స్వీపర్, స్వీపర్‌ భర్తకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెల్సింది. శనివారం మరోసారి స్థానికంగా ఉండే వైద్యులు సర్వే చేయనున్నారు.  

మరో రెండు అనుమానిత కేసులు:
కదిరి, తాడిపత్రి నుంచి మరో రెండు అనుమానిత కేసులు సర్వజనాస్పత్రికి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు అనంతపురం నుంచి రెండు అంబులెన్స్‌లను ఆయా ప్రాంతాలకు పంపారు.

వెయ్యి టెస్టులకు సిద్ధం చేసుకోవాలి 
వైరల్‌ రీసెర్చ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబోరేటరీలో వెయ్యి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన పరికరాలు, కెమికల్స్‌ సిద్ధం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావు వైద్యులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎన్ని పరీక్షలు జరిపారని, మౌలిక సదుపాయాలు ఏం కావాలని ఆరా తీశారు. ఆయన వెంట జాయింట్‌ డైరెక్టర్‌ సుదర్శన్, నోడల్‌ ఆఫీసర్‌ ఏపీ నాయుడు, వీఆర్‌డీఎల్‌ వైద్యులు తదితరులు ఉన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top