పట్టణ పేదలకు ఉచితంగా 10లక్షల ఇళ్లు

In Frastructure Development Corporation Plans to Build 10 Lakh Houses - Sakshi

ఏడాదిన్నరలో పూర్తిచేయాలని లక్ష్యం

‘స్పందన’లో దరఖాస్తుల ఆధారంగా ప్రణాళిక

భూములు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం

ఉగాది నాటికి మహిళల పేరుతో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌

అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో ఇళ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి : పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బీ–అర్బన్‌ లోకల్‌ బాడీస్‌) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఉగాది నాటికి లబ్ధిదారులకు స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి అనంతరం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీటిడ్కో నిర్ణయించింది.

మొదటి దశలో ఇలా..
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మొదటి దశ కింద 10 లక్షల వరకు ఇళ్లు నిర్మించాలని ఏపీటిడ్కో సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో ఇళ్ల కోసమే పేదల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే దాదాపు 2 లక్షల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. విజయవాడలో లక్ష ఇళ్లు, గుంటూరులో 70 వేలు, తిరుపతిలో 60వేల ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్రం మొత్తం మీద పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందని టిడ్కో గుర్తించింది.

అన్ని వసతులతో 10వేల ఎకరాల్లో నిర్మాణం
ఒక ఎకరా విస్తీర్ణంలో జి+3 విధానం కింద 100 యూనిట్లను అన్ని వసతులతో నిర్మించాలన్నది ప్రణాళిక. ఒక్కో యూనిట్‌ను 330 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఆ గృహ సముదాయాల వద్ద కమ్యూనిటీ హాలు, పార్కు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల గృహాల కోసం 10వేల ఎకరాలు అవసరమని ఉన్నతాధికారులు అంచనా వేశారు. అందుకు అవసరమైన భూములను గుర్తించే ప్రక్రియను రెవెన్యూ శాఖ ఇప్పటికే చేపట్టింది.భూసేకరణ, సమీకరణ, దాతల నుంచి సేకరించడం ద్వారా అవసరమైన భూమిని కూడా గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని కూడా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాది ప్రారంభానికి భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది నాటికి లబ్ధిదారుల పేరిట ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో ఒక ఎకరా భూమిని ఉమ్మడిగా 100 మంది లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ టిడ్కో ఎండీ దివాన్‌ మైదీన్‌ ‘సాక్షి’కి తెలిపారు. మహిళల పేరిటే పట్టాలు ఇస్తారు. అనంతరం ఆ భూముల్లో ఏపీటిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. అందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో బిడ్లు ఆహ్వానిస్తారు. అలాగే, ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యమని ఉన్నతాధికారులు చెప్పారు.

ప్రణాళికలు సిద్ధం
గతంలోని టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు కూడా తమ వాటాగా డబ్బులు చెల్లించాలనే విధానం రూపొందించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.2.65 లక్షలు, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.3.65 లక్షలు, 430 చ.అడుగుల విస్తీర్ణంలోని యూనిట్‌కు రూ.4.65 లక్షలు లబ్ధిదారులు చెల్లించాలని నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం పేదలకు పూర్తి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే తమ విధానమని అధికారులకు స్పష్టంచేశారు. భారీ వ్యయమవుతుందని అధికారులు చెప్పినా ఎంతైనా సరే ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తేల్చి చెప్పారు. దాంతో పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ టిడ్కో అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top