అంతిమయాత్రలో.. ఆ నలుగురు

Four Peoples help to orphans corpse - Sakshi

ఇద్దరి వల్ల ‘జన్మ’.. నలుగురి వల్ల ‘కర్మ’ సంపదలుంటేనే సమాజంలో గౌరవం లేనివారిని చూస్తే అగౌరవం.. అయిన వాళ్లందరూ ఉంటే ఆ బతుక్కు అర్థం అన్నీ ఉంటేనే జీవితానికి.. అందం ఆస్తిపాస్తులు, అష్టైశ్వర్యాలుంటేనే ‘బంధం’ ఏమీ లేదని, ఎవరూ లేరని ‘అనాథ’లుగా చూస్తాం ప్రాణమున్నంత వరకూ పలకరిస్తారు.. ప్రాణం వదిలినంక వెంట ఎవరూ రారు ఆమెకు అయిన వాళ్లెవరూ లేరు.. ఆదరించేవారు లేరు..  పెళ్లిలేదు..ఇల్లూ లేదు.. పాడె మోసే దిక్కూ లేక.. అనాథ శవం ఆ ‘నలుగురు’ కలిశారు.. అనంత లోకాలకు సాగనంపారు

అనంతపురం / యాడికి: అనాథ శవానికి ఆ నలుగురే దిక్కయ్యారు. అయినవాళ్లు ఎవరూ తిరిగి చూడకపోవడంతో వారే ముందుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికిలోని నాగులకట్టవీధికి చెందిన కొర్రపాటి వెంకటసుబ్బమ్మ (68) అవివాహిత. వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న ఈమెకు సొంతిల్లు లేదు. అద్దె ఇంటిలోనే ఉండేది. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఇటీవలే ఇల్లు ఖాళీ చేయించారు. పది రోజుల నుంచి ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లోనే ఆమె ఉంటోంది.

 సోమవారం ఉదయమంతా హుషారుగానే తిరిగిన ఈమె రాత్రి భోజనం చేసి పడుకుంది. రెండు రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో కొంత నలతగానే కనిపించేది. చలికి తట్టుకోలేకపోయిన వెంకటసుబ్బమ్మ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమెలో చలనం కనిపించలేదు. ఈగలు వాలుతుండటంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వారు పలకరించినా ఆమె నుంచి స్పందన రాలేదు. నిశితంగా పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించింది. స్థానిక చింతవనం ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన తమ్ముడు నివాసం ఉంటున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. 

తిరునాంపల్లెలో చెల్లెలు కుమారుడికి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు చివరకు పోలీసులకు విషయం చేరవేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు పెద్దపప్పూరు మండలంలోని రామకోటిలో నివసిస్తున్న ఆటో డ్రైవర్‌ పద్మనాభ భట్రాజ్‌కు సమాచారం అందించారు. భట్రాజ్‌ యాడికికి వచ్చి వృద్ధురాలి మృతదేహానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, పూలలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్‌ డెన్నీ, గ్రామ తలారి సుబ్బరాయుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అబ్దుల్‌ రజాక్‌లు మృతురాలిని ఆటోలోకి చేర్చారు. హిందూ శ్మశానవాటికలో వెంకటసుబ్బమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు.  

భట్రాజుకు కృతజ్ఞతలు 
ఆటో రవాణా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వబోతే భట్రాజ్‌ సున్నితంగా తిరస్కరించాడు. తాను స్వంత ఖర్చులతో ఇప్పటి వరకు 150 అనాథల మృతదేహాలను శ్మశానాలకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించానన్నారు. అనాథలు ఎవరైనా మృతి చెందితే తన నంబరు 94900 70655కు తెలిపితే ఎంత దూరమైనా సరే వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తానని తెలపగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మృతురాలి వద్ద ఉన్న సంచిలో రూ.1600 నగదు, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, వృద్ధాప్య పింఛన్‌ కార్డు మాత్రమే ఉందని పోలీసులు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top