మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో గురువారం అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మెదక్ జిల్లాలో జెండా వందనం ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు యువకులు, మహబూబ్‌నగర్ జిల్లాలో జెండాను దించిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి అసువులు బాశారు.
ములుగు, వనపర్తి, న్యూస్‌లైన్: మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో గురువారం అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మెదక్ జిల్లాలో జెండా వందనం ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు యువకులు, మహబూబ్‌నగర్ జిల్లాలో జెండాను దించిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి అసువులు బాశారు. వివరాలివీ.. మెదక్ జిల్లా ములుగు మండలం సింగన్నగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జెండాను ఎగురవేసేందుకు ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన నారె నరేశ్(25), కంచనపల్లి మహేష్ గౌడ్ (26) కలసి జెండా కోసం తయారుచేసిన ఇనుపపైపును గద్దెపై నిలపబోయారు.
అయితే, వారి చేతుల్లో ఉన్న పైపు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకి, షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్సకోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని బండార్‌నగర్‌లోని సీవీ రామన్ టాలెంట్ స్కూల్ రెండంతస్తుల భవనంపై ఉదయం జెండాను ఆవిష్కరించారు. పాఠశాల పీఈటీ కృష్ణానాయక్(26), పదో తరగతి విద్యార్థి శరత్ (15)లు సాయంత్రం ఇనుపరాడ్‌కు కట్టిన జాతీయ జెండాను కిందకు దించారు. మెట్ల మీదుగా తీసుకొస్తుండగా సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్‌వైర్లకు తాకి, వారిద్దరూ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన తర్వాత పాఠశాల నిర్వాహకులు కనిపించకుండాపోయారు.