క్వారీల్లో ‘రియల్’స్వారీ !

క్వారీల్లో ‘రియల్’స్వారీ ! - Sakshi


జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలు తెలియనివి కావు. తాజాగా చేబ్రోలు ప్రాంతంలో క్వారీలను పూడ్చి రియల్ వ్యాపారానికి దిగడమే ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదకర గోతులను పునాదులుగా చేసుకుని సాగిస్తున్న వ్యాపారంలో జరగరానిది జరిగితే మూల్యం చెల్లించాల్సింది అమాయకులేననే విషయం విస్పష్టం. అయినప్పటికీ అడ్డుకునేవారు లేరనే ధీమాకు తోడు రెవెన్యూ గణం నిర్లక్ష్యం వీరి అక్రమాలకు ఊతమిస్తోంది.

 

 చేబ్రోలు: గుంటూరు - విజయవాడ మధ్య కొత్త రాజధాని ఏర్పడనుందని జరుగుతున్న ప్రచారాన్ని రియల్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. చేబ్రోలు మండలంలో క్వారీ భూముల్లో సైతం అక్రమ లేఅవుట్లు వేసి భూమిని గజాల లెక్కన అమ్మి సొమ్మ చేసుకుంటున్నారు. చివరకు 25 సంవత్సరాల కిందట తవ్వి వదిలేసిన క్వారీ గుంతలనూ  పూడ్చి అక్రమంగా లేఅవుట్లు వేయడం ప్రస్తుతం మండలంలో భయాందోళన కలిగిస్తోంది.

 

 క్వారీ భూముల్లో వేస్తున్న అక్రమ లేఅవుట్లకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలకటం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు భూమి ఏ స్థితిలో వుందో కూడా గమనించకుండానే రియల్టర్లకు అనుకూలంగా దస్త్రాలు మార్చి అక్రమ దారులకు రాచబాట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 మామూలుగానే వ్యవసాయ భూమిలో లే అవుట్ వేయాలంటే తొలుత ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఆ తరువాత పంచాయతీ,ఉడా అనుమతులు పొందాలి. ఇవేమీ లేకుండా రియల్టర్లు అక్రమ లే అవుట్లు వేసి గజాల లెక్కన వ్యాపారం చేస్తున్నారు. కొందరు మాత్రం కేవలం ల్యాండ్ కన్వర్షన్ చేసి తమకు అన్ని అనుమతులు వచ్చినట్టు ప్రకటిస్తూ విక్రయిస్తున్నారు.

 

 ఇక క్వారీ భూముల విషయంలో మరీ అక్రమంగా వ్యవహరిస్తున్నారు. క్వారీగా తవ్విన భూముల్లో అసలు ప్లాట్లు వేసుకునేందుకు అనుమతే వుండదు. ఎందుకంటే క్వారీగా తవ్విన భూమి పెద్ద పెద్ద గోతులతో నిండివుండడంతోపాటు నిర్మాణాలకు ఏమాత్రం యోగ్యమైనది కాకపోవడమే ఇందుకు కారణం.

 

 ఇలా అనుమతిలేని క్వారీ భూముల్లో సైతం రియల్టర్లు వెంచర్లు వేసి కొనుగోలుదారులను ప్రమాదం అంచుకు నెట్టివేస్తున్నారు.

 

 తాజాగా చేబ్రోలు ప్రాంతంలో రోడ్డు పక్కన తవ్వి వదిలేసిన క్వారీ భూములను కొనుగోలు చేసిన రియల్టర్లు గోతులను పూడ్చి ప్లాట్లుగా విక్రయాలు జరుపుతున్నారనీ చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 చేబ్రోలు మండలంలోని 13 గ్రామాల్లో కలిపి 2011నాటికి 33,109 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 133.73 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు వేసినట్టు ఉడా అధికారులు గుర్తించారు. 161.26 ఎకరాల భూమిని కన్వర్షన్  చేసినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం క్వారీ తవ్వకాల కోసం కన్వర్షన్  చేశారు. మండలంలో ప్రస్తుతం సుమారు  500 ఎకరాల్లో క్వారీ గుంతలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

 క్వారీ గుంతలకు ల్యాండ్ కన్వర్షన్..

 నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిలో క్వారీ తవ్వుకోలంటేల్యాండ్ కన్వర్షన్  చేయాలి. అలా కన్వర్షన్  చేసిన క్వారీలుగా తవ్వి వదిలేసిన భూములను రియల్టర్లు తక్కువ ధరకు కొను గోలు చేసి వాటిని పూడ్చి తిరిగి లే అవుట్లు వేస్తున్నారు. క్వారీల్లో లే అవుట్లు వేసి నిర్మాణాలు జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.

 

పెద్ద పెద్ద గోతులను పూడ్చి అక్కడ లే అవుట్‌లు వేసి నిర్మాణాలు జరిపితే నేల పట్టు సడలి దీర్ఘకాలంలో భవనాలు కూలిపోతాయని అధికారులు చెబుతున్నారు.

 

 క్వారీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని జిల్లా పరిషత్‌కు చెందిన 42.45 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 8 ఎకరాలు మినహా మిగిలిన భూమిని క్వారీగా మార్చారు. ఇలా ప్రభుత్వ భూములను సైతం క్వారీలుగా మారుస్తూ అక్రమ ఆర్జనకు తెరతీస్తున్నారు.

 

దీనిపై తహశీల్దారు చింతా శ్రీనివాసరావును వివరణ కోరగా చేబ్రోలు మండలంలో ఇటీవల కాలం లో క్వారీల కన్వర్షన్ కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. చేబ్రోలు, వడ్లమూడి ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులకు అనుమతి ఇవ్వలే దని తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top