
మరి వీటి సంగతి?
జహీరాబాద్‌లోనూ కమనీయ ప్రదేశాలు అనేకం. కాసింత శ్రద్ధ చూపితే పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి
జహీరాబాద్,
జహీరాబాద్‌లోనూ కమనీయ ప్రదేశాలు అనేకం. కాసింత శ్రద్ధ చూపితే పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి. పర్యాటకులు ప్రకృతి సోయగాలను ఇట్టే ఆస్వాదించవచ్చు. గలగల పారుతున్న సెలయేటి పరవళ్లు, అరకును తలపించే లోయలు, ట్యాంక్‌బండ్‌ను తలపించే ‘నారింజ’ ప్రాజెక్టు జహీరాబాద్‌కు పరిసరాల్లోనే ఉన్నాయి.
ఆయా ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుంటాయి. అయినా వీటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేవిషయంలో పాలకులు శ్రద్ధ తీసుకోవడంలేదు. జాడీమల్కాపూర్ సమీపంలోని జలపాతం కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. సుందర జలపాతాన్ని వీక్షించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రమే వెళుతుంటారు. ఈ జలపాతం వేసవికాలంలోనూ ఉంటుంది. దీనిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి భారీగానే పెరిగే అవకాశం ఉంది. పట్టించుకోకపోవడంతో జలపాతం గురించి ఎవరికీ తెలియకుండా పోతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రానికి సరిహద్దులో, పడియాల్‌తండాకు కొద్ది దూరంలో గొట్టంకోట ఆటవీ ప్రాంతం ఉంది. ఇది పూర్తిగా లోయ ప్రాంతం. ఇది అరకును తలపింపజేస్తోంది.
ఈ ప్రాంతంలో పురాతన బక్కప్రభు, హనుమాన్ మందిరాలున్నాయి. అయినా ఆలయాల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. జాతర సందర్భంలోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతుంటారు. దీనిని అభివృద్ధి చేస్తే ఇరు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించే అవకాశం ఉంది. జహీరాబాద్ సమీపంలో నారింజ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇది పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే వీలుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో దారిన వెళ్లే వారికి కళావిహీనంగా దర్శనమిస్తోంది. 9వ నంబరు జాతీయ రహదారి నుంచి బీదర్ వెళ్లే రోడ్డుపై నారింజ ప్రాజెక్టు ఉండడంతో ఎప్పుడూ వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్-బీదర్ మధ్య ప్రతి 15 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడుస్తోంది. జహీరాబాద్ నిమోజకవర్గం ప్రజలు సెలవు రోజుల్లో సమీపంలో గల కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు వెళ్లివస్తారు.
పర్యాటకులు నారింజ ప్రాజెక్టు మీదుగానే ప్రయాణం చేస్తున్నా ప్రాజెక్టు వద్ద ఆగేందుకు కూడా ఉత్సాహం చూపడం లేదు. ప్రాజెక్టు ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. నారింజ ప్రాజెక్టును బీదర్ రోడ్డుకు ఇరు వైపులా అభివృద్ధి చేసి మొక్కలు నాటడంతో పాటు సీసీ నిర్మాణం పనులు చేపడితే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ను తలపింపజేస్తుందనే అభిప్రాయాన్ని పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు.
4.