వరద బాధితులతో ఆక్రందనలతో మండల కేంద్రమైన కూనవరం మిన్నంటుతోంది.
కూనవరం,న్యూస్‌లైన్: వరద బాధితులతో ఆక్రందనలతో మండల కేంద్రమైన కూనవరం మిన్నంటుతోంది. అర్హులకు పరిహారం ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరద పట్టనివారికి పరిహారం ఇచ్చి, మూడుసార్లు ముంపుకు గురైనవారికి మొండిచేయిచూపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదభాదితులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్‌అండ్‌బీ రోడ్డుపైకివచ్చి సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.తహశీల్దార్ కమల, వీఆర్‌పురం ఎస్సై శ్రీధర్ ఆందోళన వద్దకు వచ్చి అర్హుల గుర్తింపునకు రీ సర్వే నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.
సర్వేలో అవకతవకలు
మండల కేంద్రంలో వరద బాధితులు ఐదు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. సర్వేలో అవకతవకలు చోటుచేసుకోకపోవడంత వరదముంపు బాధితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్యూమరేషన్ సర్వే సమయంలోనే రెవెన్యూధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వరదపట్టని ప్రదేశాలకు చెందిన కొందరు ఎన్యూమరేషన్ జాబితాలో తమపేర్లు చేర్చినట్లైతే పరిహారం మంజూరయ్యాక చెరిసగం పంచుకుందామంటూ ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇళ్ళసర్వేకి వచ్చిన రెవెన్యూ సిబ్బంది రాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో బస చేసినప్పుడు వారికి స్థానిక సిబ్బంది తోడై ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఇలాంటివి సమర్థించుకునేందుకు సదరు అధికారులు పక్కాభవనాలకు, దుకాణాలకు, రెండుమూడు పోర్షన్‌ల్లో ఉన్నవారికి నష్టపరిహారం రాదని చెబుతున్నారు. అయితే ఇటీవల పంపిణీ చేసిన వరద నష్టపరిహారం చెక్కుల్లో పూరిగుడిసెల్లో వారికంటే పైన పేర్కొన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. వాస్తవానికి గత ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు మూడో ప్రమాదస్థాయి హెచ్చరికలు దాటిప్రవహించింది. తద్వారా మండలంలో మూడువంతులు పైగాగ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఉదయభాస్కర్ కాలనీలో పక్కాగృహాలు సైతం కుప్పకూలాయి. పూరిళ్ల సంగతి చెప్పనక్కర లేదు. మండలవ్యాప్తంగా సుమారు 2000 ఇళ్లకుపైగా వరదలకు దెబ్బతిన్నాయి. సదరు అధికారులు నెలరోజుల తరువాత సర్వే నిర్వహించి కేవలం 599 ఇళ్లు మాత్రమే వరద తాకిడికి దెబ్బతిన్నట్లు తేల్చారు. టేకుబాకలో ఒకే ఒక ఇల్లు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి రీ సర్వే చేసి అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మొదట మునిగేది మా ఇల్లే ..
వరదొస్తే మొదట మునిగేది మా ఇల్లే. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు మా ఇంటి ముందు నుంచే లాంచీ ఎక్కి అటూ ఇటూ తిరుగుతారు. ఇల్లంతా మునిగిపోయి, పై నుంచి లాంచీలు తిరిగినా నాకు నష్టపరిహారం ఇవ్వలేదు .
- దగ్గుబల్లి భద్రమ్మ, కూనవరం
మధ్యనున్న ఇల్లు మునగలేదంట
మాంటి ముందు, వెనుక, పక్కనున్న ఇళ్లకు పరిహారం వచ్చింది. మధ్యనున్న నా ఇల్లు ముంపుకు గురికాలేదట. అధికారుల సర్వేలో అన్నీ అవకతవకలే. ఇదీ రెవెన్యూ అధికారుల నిర్వాకం.
- నాసుపల్లి రాజమ్మ, కూనవరం
మూడు సార్లు మునిగినా పరిహారం ఇవ్వలేదు
కొద్దిపాటి వ రద వచ్చినా మొదట మునిగేది ఉదయ భాస్కర కాలనీయే. అందులో మొట్ట మొదట మునిగే ఇల్లు కూడా మాదే. ఇప్పటికి మూడు సార్లు వరదలు వచ్చాయి. అయినా అధికారులు పరిహారం ఇవ్వలేదు.
- చిలకా వెంకటలక్ష్మి, ఉదయభాస్కర కాలనీ