తుఫాన్‌కు తోడుగా వరద ముప్పు | flood threat to coastal districts by cyclone Storm effect | Sakshi
Sakshi News home page

తుఫాన్‌కు తోడుగా వరద ముప్పు

Oct 12 2013 2:18 AM | Updated on Sep 2 2018 4:46 PM

తుపాను ముప్పునకు తోడు జిల్లాకు వరద ప్రమాదం కూడా పొంచి ఉంది. తుపాను ప్రభావంతో ఎగువనున్న ఒడిశాలో

శ్రీకాకుళం కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: తుపాను ముప్పునకు తోడు జిల్లాకు వరద ప్రమాదం కూడా పొంచి ఉంది. తుపాను ప్రభావంతో ఎగువనున్న ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగావళి, వంశధార నదుల్లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువనున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ నదుల పరివాహక ప్రాంతాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. జిల్లాలో వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో 21 మండలాల పరిధిలోని 231 గ్రామలు ఉన్నాయి. ఈ నదులకు వరదలు సంభవిస్తే వీటి పరిధిలోని సుమారు 1.30 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమవుతాయి.

 తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లుతుంది. వంశధార నది పరిధిలో 11 మండలాలు, 124 గ్రామాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో 5, గారలో 6, భామినిలో 10, కొత్తూరులో 14, సరుబుజ్జిలిలో 4, ఎల్‌ఎన్‌పేటలో 2, పోలాకిలో 17, జలుమూరులో 23, హిరమండలంలో 9, ఆమదాలవలసలో 4, నరసన్నపేటలో 30 గ్రామాలు వంశధార తీరంలో ఉన్నాయి. ఆలాగే నాగావళి పరిధిలో 10 మండలాలు, 107 గ్రామాలు ఉన్నాయి. ఆమదాలవలసలో 16, పాలకొండలో 4, రేగిడిలో 12, వీరఘట్టంలో 10, బూర్జలో 16, సంతకవిటిలో 21, వంగరలో 7, పొందూరులో 5, ఎచ్చెర్లలో 12, శ్రీకాకుళం మున్సిపాలిటీలో 4 వార్డులు ఉన్నాయి. దీంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

గొట్టా బ్యారేజీతోపాటు తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసి నిల్వ ఉన్న నీటితోపాటు ఎగువనుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు నదుల్లోకి వదిలేస్తున్నారు. ఒడిశా అధికారులతో కూడా మాట్లాడి నీటిని ఎప్పటికప్పుడు విడిచిపెట్టమని సూచించారు. వంశధార నదికి గతంలో 2012 అక్టోబర్‌, 2010 డిసెంబర్‌, 2008 సెప్టెంబర్‌. 2007 జూలై, 2006 జూలై నెలల్లో వరదలు వచ్చాయి. అలాగే నాగావళి నదికి 2006, 2007, 2008, 2010, 2012 సంవత్సరాల్లో వరదలు సంభవించి తీరగ్రామాల కు అపార నష్టం కలిగించాయి. ఈ అనుభవాలతో తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement