పాకిస్తాన్‌ రక్షణ దళాలకు బందీగా మారిన అభాగ్యులు | Fishermen Caught By Pakistan Coast Guard | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ రక్షణ దళాలకు బందీగా మారిన అభాగ్యులు

Dec 1 2018 2:56 PM | Updated on Dec 1 2018 3:15 PM

Fishermen Caught By Pakistan Coast Guard - Sakshi

రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వారివి. దినదిన గండంగా సాగే వృత్తిపైనే జీవించే కుటుంబాలవి.సముద్రమే సర్వస్వంగా... మృత్యువుకు ఎదురీది... నిత్యం పోరాటమే వారి జీవనం. ఉన్న ఊళ్లో కూడు కరువై... కుటుంబ పరిస్థితులు భారమై... బతుకు తెరువుకోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ బోటులో కూలీలుగా మారి కొందరు ప్రకృతి వైపరీత్యాల వల్ల మృత్యువాత పడుతుండగా... మరి కొందరు అనుకోని కష్టంలో చిక్కుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలోని హీరావల్‌లో బోటులో కూలీలుగా చేరి వేట చేస్తూ పాకిస్తాన్‌ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడి కోస్టుగార్డు దళాలకు బందీ అయ్యారు. తమవారిని విడిపిస్తారో లేదో... ఎన్నాళ్లు వారిని చెరలోఉంచుతారో తెలియక ఇక్కడి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఊళ్లోనే  ఉపాధి ఉంటే ఈ సమస్యలు తలెత్తేవా.. అని వారు గగ్గోలు పెడుతున్నారు. 

సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురానికి చెందినవారే గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 22 వేల మంది మత్స్యకారులున్నారు. వారిలో వివిధ కారణాల రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణంగా సుమారు 2 వేల మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికే వలసపోగా సుమారు 3500 మంది వరకు సముద్రంలో వేటకు వెళుతున్నారు. 16,500 మంది పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏ పనీ చేయలేని వారు, వృద్ధాప్యం మీద పడిన వారు మాత్రమే తీరప్రాంత గ్రామాల్లో ఉన్నారు తప్ప పనిచేయగలిగే శక్తి ఉన్నవారందరూ చాలా వరకు వలస బాటపట్టారు. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి, పతివాడ బర్రిపేట, కోనాడ, భోగాపురం మండలంలో ముక్కాం, చేపల కంచేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల నుండి మత్స్యకారులు ఎక్కువగా వలసపోతున్నారు. వీరిలో అత్యధికంగా విశాఖపట్నం మంగమారిపేట, గుజరాత్‌లో సూరత్, వీరావలి వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు.

కాటేస్తున్న కాలుష్యభూతం
తీరప్రాంత గ్రామాలను ఆనుకుని రసాయన పరిశ్రమల వ్యర్థాలు పైపులైన్లు వేసి సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో ఇక్కడి మత్స్యసంపద కాస్తా కనుమరుగైపోతోంది. ఇక్కడ చేపలు దొరకక బతువు తెరువు కోసం వలసపోతున్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితిలు మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా వలసలకు కారణంగా చెప్పవచ్చు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు గంగపుత్రులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఫలితం లేకపోయింది. చేసేది లేక వలస వెళ్లాల్సి వచ్చింది. పూసపాటిరేగ మండలంలోని ఒక్క తిప్పలవలస నుండే సుమారు వెయ్యిమంది వలస పోయినట్లు అధికారిక  లెక్కలు చెబుతున్నాయి.

నిత్యం ప్రమాదంలోనే...
ఉన్న ఊరిలో వేటసాగకపోవడంతో వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా దొరకట్లేదు. మూడు నెలల క్రితం చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలోని గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. తాజాగా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క ధనరాజు, బోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు వీరావలినుంచి వేటకు బయలుదేరి పాక్‌జలాల్లో పొరపాటున ప్రవేశించి అక్కడి రక్షణ దళాలకు బందీలుగా చిక్కారు. పాక్‌ అదుపులో వున్న ఐదుగురి కుటుంబాలను జిల్లా అధికారులు కనీసం పట్టించుకోలేదు. కనీసం ఆరా తీయలేదు. బందీల పరిస్థితిపై ఇంతవరకూ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇదీ మత్స్యకారుల ప్రాణాలకు వారిచ్చే విలువ. 

పాకిస్థాన్‌ దళాలవద్ద బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులను విడిపించేందుకు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. జీవన పరిస్థితులపై అధ్యయనం చేసి, వారు వలస వెళ్లకుండా చేయాల్సిన ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇప్పటికే స్వయం ఉపాధిపై మత్స్యకారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్థానికంగా ఉండి చేపల వేట సాగించేందుకు కొత్తగా 120 బోట్లు మంజూరుచేశాం.– మాచర్ల దివాకర్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement