జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!

Fever sufferers have reportedly consumed more than 93 crores paracetamol tablets - Sakshi

రెండో స్థానంలో నొప్పుల నివారణ బిళ్లలు

76.26 కోట్ల పెయిన్‌కిల్లర్స్‌ మందుల వినియోగం 

కాల్షియం లేమి, మధుమేహం మాత్రల వాడకమూ ఎక్కువే

టాప్‌టెన్‌ మందుల వినియోగంలో అల్సర్, అలర్జీ, రక్తపోటు మందులకూ చోటు 

8 నెలల్లో ప్రభుత్వాస్పత్రుల్లో ఈ–ఔషధి గణాంకాలివే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో గత 8 నెలల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఏకంగా 93 కోట్లకు పైగా పారాసెటిమాల్‌ మాత్రలను వినియోగించారని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాస్పత్రుల వరకూ మందుల వినియోగంలో పారాసెటిమాల్‌ మాత్రలే మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.35 కోట్లని ఈ–ఔషధి గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌కు వివరాలు అప్‌లోడ్‌ కాలేదని, అవి కూడా అందితే పారాసెటిమాల్‌ మాత్రల వినియోగం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

పెయిన్‌ ‘కిల్లర్స్‌’
నొప్పి నివారిణి (పెయిన్‌ కిల్లర్‌) మాత్రలు తరచూ వాడితే పెను ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది రోగులు పెడచెవిన పెడుతున్నారు. గత 8 నెలల్లో.. 76.26 కోట్ల డైక్లోఫినాక్‌ 50ఎంజీ మాత్రలను రోగులు వాడారు. మాత్రల వినియోగంలో పారాసెటిమాల్‌ తర్వాత వీటిది రెండో స్థానం. నెలకు సగటున 9.53 కోట్ల డైక్లోఫినాక్‌ 50ఎంజీ మాత్రలు వాడుతున్నారని వెల్లడైంది. చిన్న చిన్న నొప్పులకు కూడా ఎక్కువ మంది రోగులు పెయిన్‌కిల్లర్స్‌ వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం మాత్రల సంఖ్య 60.38 కోట్లు
రాష్ట్రంలో అత్యధికంగా వినియోగించే మందుల్లో రక్తపోటు (బీపీ) మందులు కూడా ఉంటున్నాయి. అస్తవ్యస్త జీవనశైలిలో భాగంగా రక్తపోటు (బీపీ) పెరుగుతున్న నేపథ్యంలో మందుల వాడకం ఎక్కువవుతోంది. గత 8 నెలల్లో 40.28 కోట్ల అటెన్‌లాల్‌ 50 ఎంజీ మాత్రలను బీపీ వ్యాధిగ్రస్తులు వాడారు. అదేవిధంగా మధుమేహం (షుగర్‌)తో బాధపడుతున్నవారు 60.38 కోట్ల మెట్‌ఫార్మిన్‌ 500 ఎంజీ మాత్రలను వినియోగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top