
ప్రతి ఇంటా జ్వరాలు, డెంగీ, మలేరియా బాధితులు
అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధుల విజృంభణ
వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికొదిలేసిన సర్కార్
ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం.. ఫీవర్ సర్వేలు పట్టవు
ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, వసతుల కొరత
ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తూ జేబులు
గుల్ల చేసుకుంటున్న బాధితులు అధికారిక లెక్కల ప్రకారమే
గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు
వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల మధ్య లోపించిన సమన్వయం
జ్వరంతో ఉన్న తన కుమారుడిని పట్టుకుని సెలైన్ బాటిల్‌తో వైద్యుల కోసం వేచి చూస్తున్న ఈ మహిళ పేరు లక్ష్మీదేవి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మూలగిరిపల్లికి చెందిన నిరుపేద కూలీ. తన కుమారుడు ప్రవీణ్‌కుమార్ నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధ పడటంతో ఉరవకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. అక్కడి వైద్యులు టైఫాయిడ్‌గా నిర్ధారించారు. రూ.వేలల్లో డబ్బులు ఖర్చు కావడంతో విధిలేక సోమవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది.
డెంగీ.. ఘంటికలు!
శ్రీకాకుళం జిల్లాలో డెంగీ బారిన పడ్డ ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. టెక్కలి మండలం చింతలగార గ్రామానికి చెందిన మద్ది మోహిని (35) కొద్ది రోజుల క్రితం జ్వరంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అనంతరం ఆమెను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, డెంగీ సోకినట్లు నిర్ధారించారు. దాదాపు నెల రోజులు చికిత్స అనంతరం మోహిని సోమవారం మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో మూడేళ్ల చిన్నారి దీవెన జ్వరం బారిన పడి ఆగస్టు 22న మృతి చెందింది. ఇదే జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడేళ్ల మోక్షిత డెంగీతో గత నెల 26న చనిపోయింది.
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: ‘డ్రోన్ టెక్నాలజీతో దోమలు లేకుండా చేస్తాం..! హాట్‌స్పాట్‌లను గుర్తించి డ్రోన్‌లను పంపి దోమలను నిర్మూలిస్తాం. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులే లేకుండా చేసేస్తాం..!’ గతేడాది గద్దెనెక్కిన వెంటనే సీఎం చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ ఇదీ!! మాటలైతే కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడప దాటక పోవడంతో దోమలు దండయాత్రతో ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ రోజు రోజుకు దిగజారడంతో వ్యాధులు ముసురుకుంటున్నాయి. పరిశుభ్రత మెరుగు పరచడం కోసమంటూ నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో షూట్‌లు, ప్రచార ఆర్భాటమే మినహా చిత్తశుద్ధి కరువైంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యంతో మలేరియా, చికెన్ గున్యా, విష జ్వరాలు చుట్టుముడుతున్నాయి.
భారీ వర్షాలతో నీటి కాలుష్యం కూడా దీనికి తోడు కావడంతో రాష్ట్రంలో ఇంటింటా విష జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ లాంటి అనారోగ్య బాధితులే కనిపిస్తున్నారు. లార్వా దశలోనే దోమల నివారణకు చర్యలు చేపట్టి ఉంటే దోమల బెడద ఈ స్థాయిలో ఉండేది కాదని ప్రజలు వాపోతున్నారు.
ప్రభుత్వాస్పత్రులను నీరుగార్చిన చంద్రబాబు సర్కారు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేయడంతో పేదలు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న వారికి చిన్న చిన్న మందులు కూడా దొరకని దుస్థితి నెలకొంది.
ప్రైవేట్ వైద్యంతో అప్పుల పాలు..
జ్వరాలు, సీజనల్ వ్యాధుల బాధితులు చికిత్సల కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళితే భరోసా లభించడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటే దోపిడీకి పాల్పడుతున్నాయి. కుటుంబంలో ఒకరికి విష జ్వరం, మలేరియా సోకిందంటే టెస్టులు, మందులు, కన్సల్టేషన్ ఫీజుల రూపంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఖర్చు అవుతోంది.
నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వారం పది రోజులు మంచం పడితే రోజుకు రూ.500 కూలీ లెక్కగట్టినా దాదాపు రూ.ఐదు వేల దాకా నష్టపోతున్నాడు. ఇక వైద్య చికిత్స ఖర్చులు దీనికి అదనం!
ఎగబాకిన కేసులు...
అధికారిక లెక్కల ప్రకారమే గతేడాదితో పోలిస్తే మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదు అవుతున్న విష జ్వరాలు డెంగీ, చికెన్‌గున్యా, టైఫాయిడ్ కేసులు ప్రభుత్వ లెక్కల్లోకి ఎక్కడం లేదు. వీటి సంఖ్య కూడా గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పెరిగింది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 4,780 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 6,172కి పెరిగింది. డెంగీ 1,410, చికెన్‌గున్యా 92 చొప్పున నమోదు అయ్యాయి.
ముందస్తు జాగ్రత్తలు శూన్యం..
సీజనల్ వ్యాధుల నివారణకు పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ, కేసుల నమోదుపై సర్వైలెన్స్ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. క్షేత్ర స్థాయిలో నమోదు అవుతున్న కేసులను వైద్య శాఖ పూర్తి స్థాయిలో నమోదు చేయడం లేదు.
మా పల్లె మొత్తం జ్వరాలే...
ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా వైద్యశాలకు వచ్చా. మా పల్లెల్లో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్తే రూ.వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇక్కడికి వస్తే రిపోర్టుల కోసం తిప్పుతున్నారు.
– జి.ప్రేమ్‌కుమార్, రావిపాడు, నరసరావుపేట రూరల్ మండలం
ఇప్పటి వరకు రూ.8 వేలకు పైగా ఖర్చు
నా పేరు రమణమ్మ. వీన్‌పల్లి మండలం ఇందుకూరు స్వగ్రామం. 20 రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నా. ఇప్పటి వరకు రూ.8 వేలకుపైగా ఖర్చు అయినా జ్వరం తగ్గకపోవడంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి వచ్చాను. నీరసం తీవ్రంగా ఉంది.
– రమణమ్మ, ఇందుకూరు, వీఎన్‌పల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా
అస్తవ్యస్త డ్రైనేజీ వల్లే
నా పేరు నాగరత్నం. మాది చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పార్టీ విబిపేట పంచాయతీ ఇందిరా కాలనీ. మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నా. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో దోమలు చెలరేగుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది.
– నాగరత్నం, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా
ఇంటిల్లిపాదికీ తీవ్ర జ్వరాలు
ఇటీవల దోమల వ్యాప్తి ఎక్కువైంది. నా భార్య, కుమార్తెలతో పాటు అందరం జ్వరాల బారిన పడ్డాం. తీవ్రమైన కీళ్ల నొప్పులతో ఇంటికే పరిమితమయ్యాం. బయటకు రాలేకపోతున్నాం. ప్రైవేట్ వైద్యం చేయించుకుంటున్నాం.
– డబ్బీరు వెంకటరావు, బొంపాడవీధి, అరసవల్లి
ప్రజారోగ్యానికి నాడు పెద్దపీట..
సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారి కాంటాక్ట్‌లను నిర్ధారించి పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్సలు అందించడం ఎంతో కీలకం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యాధుల కట్టడికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించేవారు. ఆశా, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటిని సందర్శించి జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు ఇతర లక్షణాలున్న వారిని గుర్తించే వారు.
పల్నాడు... మంచంపట్టింది చూడు: నరసరావుపేటలోని ఏరియా ఆస్పత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్న రోగులు
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్లే పీహెచ్‌సీ వైద్యులు స్థానికంగా వ్యాధులు ప్రబలుతున్న తీరును గమనించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించేవారు. ఫీవర్ సర్వేలో అవసరం మేరకు కిట్‌ల ద్వారా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించి ప్రాథమికంగా వ్యాధిని నిర్ధారించేవారు. స్వల్ప లక్షణాలున్న వారికి ఇంటి వద్దే మందులు అందించేవారు.
అవసరం మేరకు ఆస్పత్రులకు రెఫర్ చేసి వైద్యం అందేలా సమన్వయం చేసేవారు. దీంతో ప్రాథమిక దశలోనే మలేరియా, డెంగీ వంటి వ్యాధులు బయటపడటంతో బాధితులు ఆస్పత్రుల పాలు కాకుండా మందుల సాయంతోనే కోలుకునే వీలుండేది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం పడకేయడంతో వ్యా«ధి ముదిరిన అనంతరం బాధితులు ఆస్పత్రులకు వెళుతున్నారు. రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యువాత పడుతున్నారు.

⇒ పల్నాడు జిల్లాలో టైఫాయిడ్, డెంగీ, వైరల్ జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నరసరావుపేట ఏరియా వైద్యశాలకు ఓపీలు రెట్టింపయ్యాయి. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార లక్షణాలతో బాధపడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగింది. గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది జ్వరాల బారిన పడినట్లు వైద్య వర్గాల ద్వారా సమాచారం.
⇒ పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వైరల్, టైఫాయిడ్ జ్వరాలు చెలరేగుతున్నాయి. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఆగస్టు 18 నుంచి 31 వరకు 56 టైఫాయిడ్ కేసులు, డెంగీ కేసు ఒకటి నమోదయ్యాయి. టైఫాయిడ్ కేసులు 300 – 400 వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కనీసం బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారీ చేయడం లేదు. జ్వరాలపై గతంలో మాదిరిగా ఎటువంటి సర్వేలు, క్యాంపులు నిర్వహించడం లేదు. భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరాలకు అరకొర వైద్యం అందుతోంది.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలోని ఆస్పత్రులకు ఒకవైపు పేషెంట్లు పోటెత్తుతుండగా... మరోవైపు మందుల కొరత నెలకొంది. జ్వరాల బాధితులతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కిటకిటలాడుతోంది. కడప మోచంపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీలు 25 నుంచి ప్రస్తుతం 70కి పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు మలేరియా 8, డెంగీ 107, డయేరియా 1,683, టైఫాయిడ్ 385 కేసులు నమోదయ్యాయి.
ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తుండటంతో జిల్లా అంతటా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. చాలా ఆస్పత్రుల్లో జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులకు వాడే సాధారణ మాత్రలు కూడా అందుబాటులో లేవు. ప్రొద్దుటూరు నియోజకవర్గంతోపాటు వీఎన్ పల్లె, వేంపల్లె తదితర మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులకు కొరత ఏర్పడింది. కాగా కడప ఏడు రోడ్ల కూడలిలోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
⇒ విశాఖలోని కేజీహెచ్‌కు రోజూ ఓపీకి 10 నుంచి 20 మంది జ్వరబాధితులు వస్తున్నారు. ఇందులో 2 నుంచి 5 వరకు డెంగీ కేసులు ఉంటున్నాయి. 2 నుంచి 4 మలేరియా కేసులు, 2 నుంచి 6 వైరల్ ఫీవర్ కేసులు వస్తున్నాయి. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 153 మంది డెంగీ బారిన పడ్డారు. 89 మందికి మలేరియా సోకింది. ఇవి అధికారిక లెక్కలు కాగా అనధికారిక కేసులు చాలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో ఆగస్టులో 20,100 జ్వరాల కేసులు నమోదయ్యాయి.
⇒ శ్రీకాకుళం జిల్లాలో ఎటు చూసినా జ్వర పీడితులే. పారిశుద్ధ్యం దారుణంగా ఉంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు బాధితుల సంఖ్యను తక్కువగా చూపాలని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 84 పీహెచ్‌సీల పరిధిలో 31 మలేరియా కేసులు మాత్రమే నమోదైనట్లు చూపిస్తున్నారు. 5 డెంగీ కేసులు, 2 చికెన్‌గున్యా కేసులను గుర్తించినట్లు జిల్లా మలేరియా నివారణాధికారి పీవీ సత్యనారాయణ తెలిపారు.
⇒ అనంతపురం జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దగ్గు, ఆయాసం, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. జిల్లాలో 8 వేల మంది జ్వర పీడితులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పడకలు చాలక రోగులు అవస్థలు పడుతున్నారు.
⇒ అన్నమయ్య జిల్లాను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. రోగుల సంఖ్య ప్రస్తుతం 800–900 వరకు పెరిగింది.
⇒ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారికంగా మూడు మలేరియా కేసులు, 130 డెంగీ కేసులు, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఖాళీగా కనిపిస్తోంది.
⇒ చిత్తూరు జిల్లాలో విష జ్వరాలు చెలరేగుతున్నాయి. దగ్గు, గొంతునొప్పి, నీరసం, జలుబు, కంట్లో నీళ్లు కారడం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు బాధితులను పట్టి పీడిస్తున్నాయి. అత్యధికంగా నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, యాదమరి, పూతలపట్టు, గుడిపాల, కార్వేటినగరం, పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో కేసులు అధికమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు పూర్తిగా కుంటుపడ్డాయి.
⇒ తిరుపతి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు విష జ్వరాల బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గత పది రోజుల్లో తీవ్రత అధికమైంది. తిరుపతిలోనే 20 వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు అంచనా. జిల్లావ్యాప్తంగా 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వారికి పారాసిటమాల్ మాత్రలిచ్చి పంపుతున్నారు. వైద్యం అందక బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
⇒ వైరల్ జ్వరాలతో అంబేడ్కర్ కోనసీమ జిల్లావాసులు అల్లాడుతున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రోజూ ఓపీలో దాదాపు 30 మంది జ్వర పీడితులు వస్తున్నారు. రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో 10 నుంచి 15 మంది జ్వరాలతో వస్తున్నారు. గత పది రోజుల్లో జిల్లాలో దాదాపు రెండు వేల మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
⇒ గుంటూరు జిల్లాలో ప్రాణాలను హరిస్తున్న మెలియాయిడోసిస్ జ్వరాల కేసులు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రోజు రోజుకు జ్వరాల కేసులు పెరిగిపోతున్నాయి. డెంగీతో 60 మంది బాధపడుతున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. గుంటూరులోనే 33 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. అయితే వైద్యశాఖ లెక్కలకు, క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదు. డెంగీతోపాటు, మలేరియా, చికున్ గున్యా కేసులు జిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్స్ అందుబాటులో లేవు.
⇒ కృష్ణా జిల్లాలో నెల రోజుల్లోనే జ్వరాల కేసులు పెరిగాయి. అధికారుల లెక్కల ప్రకారం జూలైలో 1,677 మంది జ్వరాలతో బాధపడగా ఆగస్టులో ఇది 2,307కి పెరిగింది. ఒక్క నెలలోనే టైఫాయిడ్ కేసులు రెట్టింపయ్యాయి. జూలైలో నాలుగు, ఆగస్టులో ఏడు చొప్పున డెంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి.
⇒ ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా 32 మలేరియా, ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని కృష్ణలంక, కొత్తపేట, అజిత్‌సింగ్‌నగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఏ.కొండూరు మండలం రేపూడి తండాలో విష జ్వరాలు చెలరేగడంతో గ్రామం మొత్తం జ్వరాల బారిన పడింది. రోజు కూలిపై ఆధారపడి జీవిస్తున్నవారంతా కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.