సీజన్‌ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు | Sakshi
Sakshi News home page

సీజన్‌ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు

Published Mon, Jul 25 2022 4:47 PM

Seasonal Diseases Fever Causes Symptoms Precautions Treatment In Telugu - Sakshi

తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్‌ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు.  ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.  

చిత్తూరు రూరల్‌ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్‌ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్‌ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.  

తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్‌ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్‌ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్‌ ఫీవర్‌ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది.  

జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి.  నిల్వ పదార్థాలు తినకూడదుౖ  తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్‌ తప్పనసరిగా ధరించాలి.  

చికెన్‌ గున్యా: దోమ కాటు వల్ల చికెన్‌ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్‌ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . 

జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . 

మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్‌ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. 

జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్‌ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి.  

డెంగీ: వైరల్‌ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్‌ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్‌ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్‌ హెడ్‌ ట్యాంక్లు , ఎయిర్‌ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్‌ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్‌ దోమలు వృద్ధి చెందుతాయి. 

జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి .  చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్‌ కూలర్లు , ఎయిర్‌ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. 

హెపటైటిస్‌–ఏ:  వర్షాకాలంలో హెపటైటిస్‌– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది.  కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్‌ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. 

జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి.  

టైఫాయిడ్‌:  వర్షాకాలంలో టైఫాయిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం,  ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 

జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్‌ వంటివి తీసుకోవడం మంచిది.

అప్రమత్తత తప్పనిసరి 
వర్షాల కారణంగా ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు.  వర్షంలో తడవకుండా చూసుకోవాలి.                    
– శ్రీనివాసులు, డీఎంఓ 

Advertisement
 
Advertisement
 
Advertisement