ఫీజుల భారం తగ్గేదెప్పుడు? | Fee Reimbursement   Not much increase in student education | Sakshi
Sakshi News home page

ఫీజుల భారం తగ్గేదెప్పుడు?

Feb 7 2019 5:44 AM | Updated on Feb 7 2019 5:44 AM

Fee Reimbursement   Not much increase in student education - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఈ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కుటుంబాలు భారీగా ఉన్న ఫీజులు చెల్లించడానికి అప్పులు చేసి రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అప్పులు చేసే స్థోమత కూడా లేని విద్యార్థులు ఫీజులను చెల్లించలేక మధ్యలోనే చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

మరికొంతమందికి చదువులు ముగిసినా ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీలు సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో విద్యార్థులే ఆ డబ్బునూ చెల్లించి తమ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. ఆయా కోర్సుల ఫీజులను ప్రతి మూడేళ్లకోసారి పెంచుతున్న ప్రభుత్వం ఆ మేరకు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఇంజనీరింగ్‌ మాత్రమే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఫార్మా తదితర కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

రీయింబర్స్‌మెంట్‌పెంచకుండా ఫీజుల పెంపు
ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రతి మూడేళ్లకు పెంచుతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు కాలేజీల నిర్వహణకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా ఈ ఫీజులను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేస్తుంటుంది. 2016–17, 2018–19 విద్యా సంవత్సరాల ఫీజులను మూడేళ్ల క్రితం ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకురాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో అన్ని కోర్సుల ఫీజులు అమాంతం పెరిగిపోయాయి.

అయితే ఫీజులను పెంచిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై ఆ భారం పడకుండా ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచకుండా రూ.35 వేలకే పరిమితం చేసింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం తడిసిమోపెడైంది. బీటెక్‌ కోర్సునే తీసుకుంటే విద్యార్థులు అదనంగా రూ.70 వేల వరకు భరించాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేటప్పటికీ ప్రతి విద్యార్థి దాదాపు రూ.3 లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఇది ఫీజు వరకు మాత్రమే. దీనికి అదనంగా వసతి, భోజన ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ అప్పుల భారం మరింత పెరుగుతుంది.

నిపుణుల నివేదికనుపెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం
విద్యార్థులపై ఫీజుల భారం అధికంగా ఉంటోందని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. నిపుణులు కూడా ఫీజురీయింబర్స్‌మెంట్‌ పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై గతేడాది ప్రభుత్వం.. అధికారులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఫీజులు భారీగా ఉన్నందున ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.65 వేలకు పెంచాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదికను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఫీజుల పెంపునకు ఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తు
మరోవైపు 2019–20, 2021–22 విద్యా సంవత్సరాలకు ఫీజులు నిర్ణయించడానికి ఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కోరింది. ఆయా కోర్సుల నిర్వహణకయ్యే వ్యయంపై కాలేజీలు సమర్పించే ఖర్చులను పరిశీలించి ప్రస్తుత ఫీజులను పెంచనున్నారు. ఏఐసీటీఈ నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు ప్రభుత్వాన్ని, ఏఎఫ్‌ఆర్‌సీని కోరుతున్నాయి.

ఏఐసీటీఈ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాల మేరకు కాలేజీలను నిర్వహించాలంటే ప్రస్తుత ఫీజులు సరిపోవడం లేదని అంటున్నాయి. బీటెక్‌లో గరిష్ట ఫీజు రూ. 1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షలుగా, బీఫార్మసీలో రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షలుగా, ఎంబీఏలో రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షలుగా, ఎంటెక్‌లో రూ.2.31 లక్షల నుంచి రూ.2.51 లక్షలుగా ఉండొచ్చని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఈ మేర ఫీజులు పెరిగితే విద్యార్థులకు ఇచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కూడా పెంచాల్సిన అవసరముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement