లక్ష్యం.. దూరం

Farmers Loans Not Released In District Central Cooperative Bank In YSR Kadapa - Sakshi

కడప అగ్రికల్చర్‌: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలోని కొందరు అధికార పార్టీ డైరెక్టర్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీలకు ఇష్టానుసారంగా రుణాలను మంజూరు చేయించుకున్నారు. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో తాహతు లేకపోయినా బ్యాంకు అధికారులపై ఒత్తిడి చేయించి మంజూరు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ రుణాలు ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో తడిసి మోపెడై మొండి బకాయిలై కూర్చున్నాయి. దీనిపై రాష్ట్ర ఆప్కాబ్, నాబార్డు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించగా సొసైటీలకు అస్తులకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని, వాటిని రాబట్టడానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు డీసీసీ బ్యాంకు సీఈఓ వెంకటరత్నం చొరవ తీసుకుని బ్యాంకు ఉద్యోగులను గ్రూపులు ఏర్పాటు చేసి మొండి బకాయిలను రాబట్టడానికి  ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ బకాయిలు రాబడుతున్న సమయంలో ఆయా డైరెక్టర్లు కొందరు మోకాలొడ్డుతున్నారని బ్యాంకు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రుణాలు ఇప్పించుకున్నప్పుడు ఉండే శ్రద్ధ తిరిగి చెల్లించాల్సినప్పుడు ఉండదా? అని ఓ ఉద్యోగి బాహాటంగానే ఆరోపించారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాలోని 69 ప్రాథమిక సొసైటీల్లో 41 మినహా మిగిలిన 28 ప్రాథమిక సొసైటీలకు 2500 మంది రైతులు రూ.6.50 కోట్లు బకాయిపడ్డారు. దీంతో ఇవి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జిల్లాలో సహకార వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అధికార పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ల తీరే కారణమని అధికారులు అంటున్నారు.

ఇష్టారాజ్యంగా తాహతుకు మించి రుణాలను ఎగురేసుకు పోయారు.  రికవరీలకు వచ్చే సరికి  బకాయిలు రాబట్టలేక అధ్యక్షులు, డైరెక్టర్లు చేతులెత్తేశారు. ఇది ఒక కారణం కాగా సంఘాల్లో నిపుణులైన సిబ్బంది లేకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. కొందరు సీఈఓలను రాజకీయ నాయకులు తమ వాడం టూ సంఘాలకు నియమించుకుంటుండడంతో వ్యవస్థ నాశనం అవుతోందని అధికారులు పెదవి విరుస్తున్నారు. సభ్యత్వాలను పెంచుకుని రైతులను ప్రాథమిక పరపతి సంఘ కార్యాలయాల మెట్లు ఎక్కేలా చేయటంలో వైఫల్యం, సంఘాల ద్వారా రుణ మంజూరు, వసూళ్లకే పరిమితౖమైనందున ఆదాయ వనరులు కొరవడి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, పరపతేతర వ్యాపారాలతో అదనపు రాబడికి, సంఘాల అభ్యున్నతికి ప్రయత్నించకపోవడం వంటి కారణా లెన్నో సహకార సంఘాల మనుగడను కష్ట తరం చేస్తున్నాయి.

రూ.113 కోట్ల రుణంలో అర్హత కోల్పోయిన 28 సొసైటీలు
జిల్లాలో జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు బ్రాంచీలు 24 ఉన్నా యి. వీటికి అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 69 ఉన్నా యి. వీటిలో 41 సొసైటీలు 50 శాతం రుణ రికవరీ చేయగా, మిగిలిన 28 సొసైటీలు చతికిలపడ్డాయి. ఈ సొసైటీలు రూ.113 కోట్ల రుణ కేటాయింపుల్లో రుణం తీసుకోవడానికి అవకాశం లేకుం డా పోయిందని డీసీసీ బ్యాంకు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలకు పంట రుణాలను బ్యాంకు బ్రాంచీలు సమకూర్చుతున్నాయి. జిల్లాలో స్వల్పకాలిక పంట రుణాలు 72 వేల మంది కాగా, దీర్ఘకాలిక   రుణాలు 12 వేల మంది తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయా పంట రుణాలకుగాను రూ.350 కోట్లు అందజేస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక రుణ బకాయి రూ.54 కోట్లు కాగా, రెండేళ్ల కాలంగా వసూలైంది రూ.34 కోట్లు మాత్రమే. రూ.20 కోట్లు రావాల్సి ఉందని డీసీసీ బ్యాంకు అధికా రులు తెలిపారు. ఉద్యోగులు శత విధాల ప్రయత్నం చేస్తున్నా అందుకు తగ్గట్లు పాలకవర్గం నుంచి ప్రోత్సాహం లేకపోగా మోకాలడ్డేందుకు చూస్తోందని ఓ ఉద్యోగి సాక్షి ఎదుట వాపోయారు.

అధికార పార్టీ సొసైటీలకు రుణాలు
జిల్లాలో అధికార పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాథమిక సహకార సంఘాలకు కొందరు డైరెక్టర్లు అధికంగా రుణాలు మంజూరు చేయించుకున్నారు.  కొన్నింటికైతే తాహతుకు మించి మంజూరు చేయించుకుని తిరిగి చెల్లించడలో చేతులెత్తేస్తున్నారని డైరెక్టర్లపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఇష్టానుసారంగా కొందరు డైరెక్టర్లు రుణాలు పొందారు. తమ అనుచరులకు ఇప్పించారు. ఇప్పుడు ఆయా బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని దుయ్యబడుతున్నారు.

ఉదాహరణకు.. అట్లూరు పీఏసీసీ పరిధిలో పండుమిరప పంటను సాగు చేయరు. అయితే ఆ పంటకు ఇబ్బడి ముబ్బడిగా ఆ సొసైటీలో రుణాలు ఇచ్చారు. ఈ పంటకు అధికంగా పెట్టుబడి అవుతుంది కాబట్టి స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ విధంగా రుణాలు ఇచ్చారంటే ఆ సొసైటీకి ఒక విధంగాను మిగతా సొసైటీలకు మరో విధంగాను రుణాలు ఇచ్చారంటే పాలకవర్గం ప్రమేయంతోనే ఇలా కేటాయించుకుంటారని రిటైర్డ్‌ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదే విధంగా బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజవర్గాల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించే సోసైటీల్లోనే ఈ బకాయిలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు.
 
రాష్ట్రంలో చివరి స్థానానికి చేరిన బ్యాంకు గ్రేడింగ్‌
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డీసీసీ బ్యాంకులకు గ్రేడింగ్‌ విధానంలో మన డీసీసీ బ్యాంకు ఆఖరు స్థానంలో ఉంది.  రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా రుణాలు ఇచ్చిన, వసూళ్లలో వెనుకబడిన బ్యాంకుల జాబితాను ఆప్కాబ్‌ తయారు చేస్తుంది. ఆ విధంగా కడప డీసీసీ బ్యాంకు గ్రేడింగ్‌ చూస్తే చివరి నుంచి 5 స్థానంలో ఉన్నట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం.

నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నాకు సంబంధంలేదు
బ్యాంకు బ్రాంచీల నుంచి పీఏసీసీలకు రుణాలు ఇచ్చిన సమయంలో నేను లేను. ఆ సమయంలో ఉన్న వారు ఇచ్చిన అప్పుల వసూళ్లు రాబట్టాలంటే తలప్రాణం తోకకొస్తోంది.  గ్రూపులుగా ఉద్యోగులను నియమించి మొండిబకాయిలను రాబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నేనెలా బాధ్యత వహిస్తాను. –వెంకటర త్నం,సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top