విత్తే.. చిత్తు చేసింది! | farmers cheated with a fake cotton seeds | Sakshi
Sakshi News home page

విత్తే.. చిత్తు చేసింది!

Nov 29 2013 4:01 AM | Updated on Mar 28 2018 10:59 AM

నకిలీ పత్తి విత్తు రైతన్నను చిత్తు చేసింది. ఏపుగా పెరిగి కళకళలాడిన చేను చివరికి కాత కాయకుండా నిండా ముంచింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  నకిలీ పత్తి విత్తు రైతన్నను చిత్తు చేసింది. ఏపుగా పెరిగి కళకళలాడిన చేను చివరికి కాత కాయకుండా నిండా ముంచింది. ఇటీవల శంకర్‌పల్లి, షాబాద్, మోమిన్‌పేట మండలాల్లో నకిలీ విత్తనాల తంతు వెలుగుచూసిన విషయం తెలిసిందే. మహికో కనక్(7351) రకం విత్తనాలు వాడిన రైతుల పొలాల్లో చేను దట్టంగా, ఏపుగా పెరిగినప్పటికీ కాత మాత్రం కాయలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తేరుకున్న జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఇద్దరు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. పత్తి చేలను పరిశీలించిన బృందం విత్తన లోపం వల్లే పంట దిగుబడి రాలేదని తేల్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖకు నివేదికను సమర్పించింది.
 పూత దశలోనే రాలిపోయింది
 జిల్లాలోని శంకర్‌పల్లి, షాబాద్, మోమిన్‌పేట మండలాల్లో సుమారు 173మంది రైతులు దాదాపు 300లకు పైగా ఎకరాల్లో మహికో కనక్(7351) పత్తి విత్తనాలను వాడినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో క్షేత్ర పర్యటన చేసిన విచారణ బృందం పంటను పరిశీలించింది. ఒక్కో పత్తి చెట్టుకు సగటున 50వరకు కాయలు ఉండాల్సి ఉండగా కేవలం రెండు నుంచి మూడు కాయలు మాత్రమే ఉండడాన్ని గమనించింది. నమునాలను సేకరించి ల్యాబ్‌కు తరలించింది. దీంతో పూర్తిస్థాయిలో పరిశీలించిన శాస్త్రవేత్తలు చివరకు విత్తనాల లోపంతో పూత దశలోనే రాలిపోవడం జరిగినట్లు నిర్ధారించారు. ఈమేరకు నివేదికను జిల్లా వ్యవసాయ శాఖకు సమర్పించారు. త్వరలో  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం క్షేత్ర పరిశీలన చేపట్టి నష్టం అంచనాలను తయారు చేయనున్నట్లు, ఇందుకు మరో వారం రోజులు సమయం పట్టొచ్చని జేడీఏ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 మరింత నష్టం..
 నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం రోజుకోచోట వెలుగు చూస్తోంది. కనక్(7351) రకం వాడిన రైతులు పలు చోట్ల నష్టపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నష్టం మరింత ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ భావిస్తోంది. అయితే విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సదరు బిల్లులతో సంప్రదించిన క్రమంలో ఆయా వివరాలను రికార్డు చేసుకుని  క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారించాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement