breaking news
fake cotton seed
-
విత్తే.. చిత్తు చేసింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నకిలీ పత్తి విత్తు రైతన్నను చిత్తు చేసింది. ఏపుగా పెరిగి కళకళలాడిన చేను చివరికి కాత కాయకుండా నిండా ముంచింది. ఇటీవల శంకర్పల్లి, షాబాద్, మోమిన్‌పేట మండలాల్లో నకిలీ విత్తనాల తంతు వెలుగుచూసిన విషయం తెలిసిందే. మహికో కనక్(7351) రకం విత్తనాలు వాడిన రైతుల పొలాల్లో చేను దట్టంగా, ఏపుగా పెరిగినప్పటికీ కాత మాత్రం కాయలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తేరుకున్న జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఇద్దరు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. పత్తి చేలను పరిశీలించిన బృందం విత్తన లోపం వల్లే పంట దిగుబడి రాలేదని తేల్చింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖకు నివేదికను సమర్పించింది. పూత దశలోనే రాలిపోయింది జిల్లాలోని శంకర్పల్లి, షాబాద్, మోమిన్‌పేట మండలాల్లో సుమారు 173మంది రైతులు దాదాపు 300లకు పైగా ఎకరాల్లో మహికో కనక్(7351) పత్తి విత్తనాలను వాడినట్టు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో క్షేత్ర పర్యటన చేసిన విచారణ బృందం పంటను పరిశీలించింది. ఒక్కో పత్తి చెట్టుకు సగటున 50వరకు కాయలు ఉండాల్సి ఉండగా కేవలం రెండు నుంచి మూడు కాయలు మాత్రమే ఉండడాన్ని గమనించింది. నమునాలను సేకరించి ల్యాబ్‌కు తరలించింది. దీంతో పూర్తిస్థాయిలో పరిశీలించిన శాస్త్రవేత్తలు చివరకు విత్తనాల లోపంతో పూత దశలోనే రాలిపోవడం జరిగినట్లు నిర్ధారించారు. ఈమేరకు నివేదికను జిల్లా వ్యవసాయ శాఖకు సమర్పించారు. త్వరలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం క్షేత్ర పరిశీలన చేపట్టి నష్టం అంచనాలను తయారు చేయనున్నట్లు, ఇందుకు మరో వారం రోజులు సమయం పట్టొచ్చని జేడీఏ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. మరింత నష్టం.. నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం రోజుకోచోట వెలుగు చూస్తోంది. కనక్(7351) రకం వాడిన రైతులు పలు చోట్ల నష్టపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నష్టం మరింత ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ భావిస్తోంది. అయితే విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సదరు బిల్లులతో సంప్రదించిన క్రమంలో ఆయా వివరాలను రికార్డు చేసుకుని క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారించాలని భావిస్తోంది. -
42 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
పెదకాకాని, న్యూస్‌లైన్ :ఆటోనగర్ కేంద్రంగా భీమవరం తరలించేందుకు లారీలో సిద్ధంగా వున్న 42.55 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. శ్రమనే నమ్ముకున్న అమాయక రైతులను మోసం చేసేందుకు లారీలో తరలుతున్న విత్తనాలను నోబుల్ వేబ్రిడ్జి వద్ద శనివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. నకిలీ పత్తి విత్తనాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడుల్లో పాల్గొని నోబుల్ వేబ్రిడ్జి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న నకి లీ పత్తి విత్తనాల లారీని శనివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. సరుకు యజమాని పేర్ల సాయికుమార్, లారీడ్రైవర్ నల్లపాటి రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గుళ్ళపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు, ఆటోనగర్ సూర్య సీడ్స్ కంపెనీల నుంచి ఎక్కువ భాగం శుద్ధిచేసిన విత్తనాలను సేకరించినట్లు గుర్తించారు. పలు కంపెనీ బిల్లులు సరుకు యజమాని వద్ద ఉన్నప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేదు. రైతులకు అమ్మడానికి వీలుగా ప్యాకింగ్ చేసేందుకు తరలిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. నకిలీ పత్తి విత్తనాలు తరలించడం, కంపెనీలకు సంబంధం లేని బిల్లులు ఉండడం వెనుక నకిలీ విత్తనాల ర్యాకెట్ జిల్లాలో నడుస్తోందని, కొందరి సిబ్బంది ప్రమేయం ఉందా అనేది అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్‌లో గతంలో కూడా న కిలీ విత్తనాలు తయారుచేయడంపై కేసు నమోదైంది. నకిలీ పత్తి విత్తనాల లారీని సీజ్ చేసి, నిందితులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. గుంటూరు వ్యవసాయ అధికారి వి.జగదీశ్వరరెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో గుంటూరు ఏడీఏ సీహెచ్ రవికుమార్, విజిలెన్స్ఎన్ఫోర్స్మెంట్ ఏవో బి.రవిబాబు,పెదకాకాని ఏవో బి.అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.