పాము కాటు కన్నా కార్పొ‘కేటు’తోనే రైతన్న మరణం

Farmer Died For Negligence Of Corporate Hospital Chittoor - Sakshi

అనాథలైన భార్య, ముగ్గురు ఆడబిడ్డలు 

భారీగా దండుకొని దుర్మార్గం

సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పాముకాటుకు గురైన ఓ రైతు అపస్మారక స్థితిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. జిల్లాలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదు. చివరకు  సోమవారం వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. చికిత్సలు చేస్తామని డబ్బులు గుంజుకున్న తిరుపతి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల తరువాత చేతులెత్తేయడంతోనే ఈ దారుణం జరిగిందని మృతుని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బాధితుల కథనం మేరకు కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ కమతంపల్లెకు చెందిన కాకర్ల గుడ్రాజప్ప కుమారుడు రైతు కే శ్రీనివాసులు (50) వ్యవసాయం చేసుకుంటూ భార్య రెడ్డెమ్మ, ముగ్గురు కుమార్తెలను పోషించుకునేవారు.

అతడు గురువారం పొలంలో పనులు చేస్తుండగా కాలుపై పాముకాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాసులును కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌ నడుపుతున్న ఓ యువకుడు అతడిని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా కార్పొరేట్‌ వైద్యులు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తిపడి తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చించి వచ్చేశాడు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు వివిధ రకాల పరీక్షలు, చికిత్సల పేరుతో సుమారు రూ.1.50 లక్షలు వసూలు చేశారు. మూడు రోజుల తర్వాత తమవల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పంపేశారు. మళ్లీ అతడిని మదనపల్లెలోని ప్రభుత్వాస్పత్రికి సోమవారం ఉదయం తీసుకువచ్చి చేర్పించారు. తరువాత అదే రోజు చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మరణించారు. భార్య, ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top