బీమా కోసం మళ్లీ చంపేశారు

Family members creates accident story for life insurance money - Sakshi

తెనాలిలో సినీ ఫక్కీలో ఘటన

తెనాలి రూరల్‌:  సినీ ఫక్కీలో.. ఇన్సూరెన్స్‌ కోసం అనారోగ్యంతో మృతి చెందిన ఒక వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు మృతుడి బంధువులు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి దానిపై నుంచి కారును పోనిచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతమంది రైతులు రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని చూసి ప్రమాదంలో మరణించాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనుమానమొచ్చిన పోలీసులు తమదైన శైలిలో మృతుడి బంధువులను విచారించడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళ్తే..  తెనాలి మండలం పెదరావూరులోని సుగాలి కాలనీకి చెందిన రమావత్‌ ఖత్నానాయక్‌ (56) అనారోగ్యంతో బుధవారం ఉదయం ఇంటిలో మృతి చెందాడు. అయితే సుమారు నెలన్నర క్రితం ఆయన ప్రమాద బీమా పాలసీ తీసుకున్నాడు.

దాదాపు రూ.10 లక్షల విలువైన బీమాకు గత నెల 31న బాండ్‌ వచ్చింది. దీంతో ఖత్నానాయక్‌ ప్రమాదం కారణంగా మృతి చెందాడని నమ్మిస్తే డబ్బులు వస్తాయన్న ఆలోచన కుటుంబసభ్యులు, బంధువులకు వచ్చింది. వెంటనే పథకం రచించారు. పెదరావూరు నుంచి చినపరిమి డొంకకు వెళ్లే రోడ్డులోకి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చారు. రోడ్డుపై పడుకోబెట్టి, వెనుక తెచ్చిన కారును మృతదేహం మీదకు ఎక్కించి వెళ్లిపోయారు. స్థానికంగా పొలం పనులు చేస్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఎస్‌ఐ జయకుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి అల్లుళ్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top